PATHOLES | గుంతల రోడ్లు తప్పని తిప్పలు
ఇంకెన్ని రోజులు ఈ నరకయాతన అంటున్నా వాహనదారులు ?
చటాన్‌పల్లి బ్రిడ్జ్ ఇరువైపులా రహదారికి తక్షణమే మరమ్మత్తులు చేపట్టండి అంటూ స్థానికుల డిమాండ్
షాద్‌నగర్ మున్సిపల్ పరిధిలోని బుచ్చిగూడ–చటాన్‌పల్లి సమీపంలోని జాతీయ రహదారి బ్రిడ్జ్‌కు ఇరువైపులా గుంతల రోడ్డు వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రతిరోజూ ఈ మార్గం గుండా వేల సంఖ్యలో ఉద్యోగస్తులు, రైతులు, వ్యాపారులు, విద్యార్థులు వేలాదిమంది ప్రయాణం చేస్తున్నారు. అయితే రహదారి దుస్థితి కారణంగా ప్రయాణం ఒక్కోసారి ప్రాణపాయం అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ప్రారంభమైనప్పటి నుండి రోడ్డు పూర్తిగా దెబ్బతిని, చిన్నచిన్న గుంతలు ఇప్పుడు పెద్ద ప్రమాదకర మార్గంగా మారాయని ప్రజలు వాపోతున్నారు. ప్రతి రోజు ఈ మార్గంలో వాహనాలు నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు సంభవిస్తున్నాయని, కొందరు గాయపడి ఆస్పత్రుల పాలవుతున్నారని స్థానికులు చెబుతున్నారు.
ప్రజల ప్రాణాలు పోతే కానీ అధికారులు స్పందిస్తారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల టైర్లు పగిలిపోవడం, సస్పెన్షన్‌లు దెబ్బతినడం వంటివి సాధారణమైపోయాయని, తాము సంపాదించిన కష్టం మొత్తాన్ని వాహనాల మరమ్మత్తులకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
రాత్రి వేళల్లో లైట్లు తక్కువగా ఉండటంతో గుంతలు కనబడకపోవడం వల్ల ప్రమాదాలు మరింతగా పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు. ఆంబులెన్స్ వాహనాలు కూడా ఈ దారిలో ఆలస్యంగా కదలాల్సి వస్తోందని, ఇది అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.స్థానికులు పలుమార్లు మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేసినా, స్పందన లేకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల పన్నులతో నిర్మించిన రహదారులు ఇలా ధ్వంసమవుతుంటే అధికారుల నిర్లక్ష్యం ఏమిటి ?అంటూ ప్రశ్నిస్తున్నారు.ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని చటాన్‌పల్లి బ్రిడ్జ్ ఇరువైపులా రహదారికి తక్షణమే పటిష్టమైన మరమ్మత్తులు చేపట్టాలని, శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు , స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రహదారి సక్రమంగా పునర్నిర్మాణం చేస్తేనే ప్రమాదాల బారిన పడకుండా ప్రజలు సురక్షితంగా ప్రయాణించగలరని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Publisher
Namasthe Bharat