ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ
షాద్ నగర్ మున్సిపాలిటీ ఫరూఖ్ నగర్ లో ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
4000 పెన్షన్, ఇందిరమ్మ ఇండ్లు, రైతు కూలీలకు 12,000, రైతు భరోసా నిధులు, కల్యాణ లక్ష్మి తులం బంగారం, సిలిండర్లకు 500 సబ్సిడీ వంటి పథకాలు అమలుకోవడం లేదని అంజయ్య యాదవ్ ముందు గోడు వెళ్ళబోసుకున్న బాదిత ప్రజలు
కేసీఆర్ అన్ని పథకాలను అందిస్తే రేవంత్ రెడ్డి దొంగ మాటలు చెప్పి మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు
రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని బహిరంగంగా హెచ్చరించిన మహిళలు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి బాకీ పడిందని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా షాద్ నగర్ మున్సిపాలిటీ ఫరూఖ్ నగర్ లో స్వయంగా ప్రజలతో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? లేదా? అనే విషయాలను క్షేత్రస్థాయిలో తెలుసుకున్న అనంతరం మాట్లాడారు. వంద రోజుల్లో గ్యారంటీలను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను మర్చిపోయిందని విమర్శించారు. ఉచిత బస్సు మినహా ఏ పథకం కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారని, పేద ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. సాధారణ కుటుంబానికి సైతం కాంగ్రెస్ ప్రభుత్వం వేల రూపాయలు బాకీ పడిందని, కాంగ్రెస్ చేతిలో మోసపోయామని పేద ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. ఇందులో భాగంగానే 4000 పింఛన్లు, రాయితీ సిలిండర్లు, గృహా జ్యోతి విద్యుత్తు, రైతు కూలీలకు 12,000, మహిళలకు 2500, విద్యార్థులు విద్యార్థినీలకు స్కూటీలు, రైతు భరోసా నిధులు, రైతు రుణమాఫీ, బతుకమ్మ చీరల పంపిణీ వంటి ఎన్నో పథకాలు అమలు చేయడం లేదని ప్రజలు బహిరంగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తున్నారని చెప్పారు.
అంజయ్య యాదవ్ ముందే పలువురు మహిళలు, వృద్ధులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తిట్ల దండకాన్ని వల్లించారు. మోసపోయి ఓటు వేశామని, మరోసారి ఓట్ల కోసం వస్తే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని బహిరంగంగానే మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెబితే ఉన్న ఇల్లును కులాకొట్టుకున్నామని, ఇప్పుడు ఎవరు పట్టించుకోవడంలేదని ఓ మహిళా వాపోయింది. గృహ జ్యోతి ద్వారా జీరో బిల్లు రావడం లేదని, మా కుటుంబం అత్యంత పేదరికంలో ఉందని ఓ వృద్ధురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. పండుగ పూట ఒక్క బతుకమ్మ చీర కూడా ఇవ్వలేదని, కేసీఆర్ ఉన్నప్పుడు నాలుగైదు రోజుల ముందే ఇంటింటికి చీరలు ఇచ్చిండని గుర్తు చేశారు. మా కూతురు పెళ్లి అయి ఆరు నెలలు గడిచిన ఇప్పటికీ తులం బంగారం ఊసే లేదని, మాకు బంగారం ఇస్తాడని నమ్మకమే లేదని ఓ మహిళ వాపోయింది. ఇలా అడుగడుగునా ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం పై దుమ్మెత్తి పోశారు.
ప్రజల ఆవేదనను గ్రహించిన అంజయ్య యాదవ్ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఈట గణేష్, సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నటరాజ్, మండల అధ్యక్షులు నటరాజ్, మాజీ కౌన్సిలర్లు పిల్లి శారద శేఖర్, యుగంధర్, వెంకట్రాంరెడ్డి, కౌసల్య శంకర్, చిన్న యాదగిరి, నాయకులు దేవేందర్ యాదవ్, కోస్గి శ్రీను, రవి యాదవ్, గోపాల్ గౌడ్, నందిగామ శ్రీను, భిక్షపతి, బిలాల్, రాం చందర్, గుండు అశోక్, శివ, సాధక్, మహామూద్, నార్ల శ్రీనివాస్, సంజు నాయక్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
Publisher
Namasthe Bharat