మాజీ ఎంపిటిసిలు, సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించడి
అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడ్తునమ్మన్న మాజీ ఎంపిటిసి భూక్య జ్యోతి
బిల్లులు చెల్లిస్తామని చెప్తూనే ప్రభుత్వం కాలయాపన చెయ్యడంపై ఫైర్
మరిపెడ: అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడ్తునమ్మన్నమని వెంటనే ప్రభుత్వం మాజీ ఎంపిటిసిలు, మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను చెల్లించాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ఉల్లేపెల్లి మాజీ ఎంపిటిసి భూక్య జ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం ఆమె మాట్లాడుతూ చిన్న వయస్సులో ప్రజా సేవ చేసే అవకాశం వచ్చిందని మురిసిపోయి ఎన్నుకున్న ప్రజల కోసం గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచ్లు, ఎంపిటిసిలు అప్పులు తీసుకొచ్చి గ్రామాలు, తండాలలో అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. రూ.లక్షలు వెచ్చించి అభివృద్ధి పనులు చేసిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం మారిపోవడం, పదవులు ముగిసిపోయి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్న బిల్లులు చెల్లింపు సమస్య పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో మాజీ సర్పంచ్లు, ఎంపిటిసిలు అనేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బిల్లులు రాక, అభివృద్ధి పనుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక అనేక మంది మాజీ సర్పంచ్, ఎంపిటిసిలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు పెండింగ్ బిల్లులు అందిస్తామని ప్రగ్భలాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హామీని విస్మరించిందని ఆరోపించారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని చెప్తూనే ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు విడుదల చేయకుండా ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిగా వ్యవహరిస్తుందని దయ్యబట్టారు. ప్రజలపై, మాజీ సర్పంచ్లు, ఎంపిటిసిలపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని, లేనియెడల ఓట్ల కోసం వచ్చే పాలకులను తండాలు, గ్రామాలలో అడ్డుకుంటామని ఆమె హెచ్చరించారు.
Publisher
Namasthe Bharat