చనిపోయిన మున్సిపల్ కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని
శ్రీనివాస్ మరణంపై శంకర్పల్లి మున్సిపల్ కార్మికుల ఆందోళన
మున్సిపల్ కార్మికుల ప్రాణాలకు రక్షణతో పాటు ₹20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని - సిఐటియు డిమాండ్
ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి
ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక ఆందోళన చేస్తామని హెచ్చరిక
శంకర్పల్లి మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికుల విధుల బహిష్కరణ
శంకర్పల్లి పురపాలక సంఘంలో పనిచేసే మున్సిపల్ కార్మికుడు శ్రీనివాస్ మంగళవారం తన విధుల్లో ఉండగా మృతిచెందిన నేపథ్యంలో వారి కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు శంకర్పల్లి మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అల్లి దేవేందర్ మాట్లాడుతూ — శంకర్పల్లి మున్సిపల్ కార్మికుడు శ్రీనివాస్ విధి నిర్వహణలో మరణించడం తీవ్రంగా విచారకరం.
ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం కనీసం ₹20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలి అని అన్నారు. అదే విధంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నా, ప్రభుత్వం వారిని పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. ప్రతి మున్సిపల్ కార్మికునికి ఇన్సూరెన్స్, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
శ్రీనివాస్ కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయకపోతే, యూనియన్ ఆధ్వర్యంలో నిరవధికంగా విధులు బహిష్కరించి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు బిసొల్లా రమేష్, కోశాధికారి రాములు, ఉపాధ్యక్షులు కృష్ణ, జవాన్ శ్రావణ్, పారిశుద్ధ్య కార్మికులు, వాటర్‌మ్యాన్‌లు, ఎలక్ట్రిషన్లు తదితరులు పాల్గొన్నారు.
Publisher
Namasthe Bharat