దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్
భారతదేశం నలుమూలల నుండి పాల్గొన్న యువ క్రీడాకారులు
- శంకరపల్లి మణి గార్డెన్స్ వేదికగా క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణకు అద్భుత ప్రదర్శన
- కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన వందలాది యువ క్రీడాకారులు
- ప్రధాన అతిథులు గా ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ,కె.ఎస్. రత్నం, డాక్టర్ మల్గారి వైభవ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి
- విజేతలకు పతకాలు, అభినందన పత్రాలు అందజేసిన అతిథులు
శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని మణి గార్డెన్స్ వేదికగా తొలిసారిగా దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్ ఘనంగా, విజయవంతంగా నిర్వహించారు. ఈ పోటీలలో దక్షిణ భారతదేశం నలుమూలల నుండి వచ్చిన వందలాది మంది యువ క్రీడాకారులు పాల్గొని తమ కరాటే ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించారు. క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి, పోరాట తత్వం వంటి అంశాలు ఈ పోటీలలో స్పష్టంగా కనిపించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రీడలు మనలో క్రమశిక్షణను, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని, ఇలాంటి జాతీయ స్థాయి పోటీలు యువతలో క్రీడాస్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే కె.ఎస్. రత్నం, బీజేపీ యువ నాయకుడు డాక్టర్ మల్గారి వైభవ్ రెడ్డి, శంకర్‌పల్లి బీజేపీ సీనియర్ నేత శ్రీ ప్రభాకర్ రెడ్డి మరియు పలువురు నాయకులు, ప్రముఖులు పాల్గొని క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. నిర్వాహకుల కృషిని కొనియాడుతూ, భవిష్యత్తులో శంకర్‌పల్లి మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఆతిథ్యం ఇవ్వాలని ఆకాంక్షించారు. పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు ముఖ్య అతిథులు పతకాలు మరియు అభినందన పత్రాలు అందజేశారు. విజేతలతో పాటు పాల్గొన్న ప్రతీ క్రీడాకారుడు కూడా ప్రోత్సాహకరమైన మాటలు విని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, కోచ్‌లు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు. కరాటే క్రీడకు ఉన్న ప్రాధాన్యతను చాటి చెప్పిన ఈ ఛాంపియన్‌షిప్ శంకర్‌పల్లిలో ఒక మరిచిపోలేని క్రీడా వేడుకగా నిలిచింది. యువతకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇటువంటి పోటీలు తరచుగా జరగాలని క్రీడాభిమానులు అభిలాష వ్యక్తం చేశారు.
About The Author
Advertise

