ముంపు సమస్యకు పరిష్కారం
హుస్సేన్‌సాగర్ నాలాను కలుపుతూ కాలువ నిర్మాణం
- దోమలగూడ, బాగ్‌లింగంపల్లిలో పర్యటించిన హైడ్రా కమిషనర్
- ఆశోక్‌నగర్‌లో వరద కాలువ విస్తరణకు కమిషనర్ ఆదేశం
నగరంలో నీట మునిగిన లోతట్టు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. బాగ్‌లింగంపల్లిలోని శ్రీరాంనగర్ కాలనీతో పాటు.. దోమలగూడలోని గగన్‌మహల్, అశోక్‌నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో తమ ప్రాంతాలు నీట మునుగుతున్నాయని స్థానికులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వర్షం పడితే వణికిపోవాల్సి వస్తోందని, బాగ్‌లింగంపల్లిలోని శ్రీరాంనగర్ కాలనీ వాసులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ముందు వాపోయారు. లోతట్టు ప్రాంతంలో ఉన్న తమ కాలనీలో పెద్దమొత్తంలో వరద నీరు వచ్చి చేరుతోందని అన్నారు. గతంలో ఇక్కడ ఉన్న ఖాళీస్థలంలోంచి హుస్సేన్‌సాగర్ నాలాలోకి వరద నీరు చేరేదని.. అక్కడ పైపులైను దెబ్బతినడంతో సమస్య తలెత్తుతోందని చెప్పారు. 450 ఇళ్లు వరద నీటిలో మునుగుతున్నాయని స్థానికులు వాపోయారు. గురువారం, శుక్రవారం వరుసగా హైడ్రా కమిషనర్ వచ్చి సమస్య తీవ్రతను పరిశీలించడం, పరిష్కారానికి చర్యలు తీసుకోవడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
ఖాళీ స్థలంలోంచి కాలువ నిర్మాణం..
శ్రీరాంనగర్ కాలనీని ముంచెత్తిన వరద నీరు హుస్సేన్‌సాగర్ నాలాలో కలిసేలా ఇక్కడ ఉన్న ఖాళీస్థలంలో కాలువ నిర్మాణాన్ని చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌గారు చెప్పారు. కాలువ తవ్వకం పనులను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. శ్రీరాంనగర్ కాలనీలో చేరిన వరద నీటిని హైడ్రా హెవీ మోటర్లు పెట్టి తోడించడాన్ని చూశారు. ఇక్కడ ఖాళీ స్థలం ప్రభుత్వానికి చెందినదని.. ఇందులోంచి గతంలో ఉన్న పైపులైన్లను పునరుద్ధరిస్తున్నామని కమిషనర్ చెప్పారు. ఒక వేళ ఈ స్థలం తమదని ఎవరైనా చెబితే.. టీడీఆర్ కింద నష్టపరిహారానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అంతే కాని గతంలో ఉన్నపైపులైన్లను క్లోజ్‌చేయడం సరికాదన్నారు.
వరద తగ్గాక పూడికను తొలగిస్తాం..
దోమలగూడలోని గగన్‌మహల్ ప్రాంతం, హుస్సేన్‌సాగర్ నాలాలో పూడికను తొలగిస్తే చాలావరకు సమస్య పరిష్కారం అవుతుందని స్థానికులు హైడ్రా కమిషనర్‌కు తెలిపారు. హుస్సేన్‌సాగర్ నాలాలో వరద ప్రవాహ తీవ్రతను, ఆటంకాలను అక్కడ నీట మునిగిన అపార్టుమెంట్లు పైకి ఎక్కి కమిషనర్ పరిశీలించారు. నాలా ఆక్రమణలతో పాటు.. వరద సాఫీగా సాగకపోవడానికి కారణాలను తెలుసుకున్నారు. వరద పోటెత్తడంతోనే పరిసరాల్లోకి నీళ్లు వచ్చి చేరుతోందన్నారు. వరద ప్రవాహ తీవ్రత తగ్గిన వెంటనే జేసీబీలను కాలువలోకి దించి పూడికను తొలగిస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు హామీ ఇచ్చారు. అలాగే కాలువలో ఆక్రమణలను కూడా తొలగిస్తామన్నారు.
అశోక్‌నగర్‌లో కాలువను విస్తరిస్తాం..
అశోక్‌నగర్‌లోంచి హుస్సేన్‌సాగర్ వరద కాలువను అనుసంధానం చేసే నాలాను విస్తరిస్తామని హైడ్రా కమిషనర్ చెప్పారు. భారీ వర్షాలు పడినప్పుడు ఇందిరాపార్కు నుంచి వచ్చే వరద మొత్తం అశోక్‌నగర్ మీద పడుతోందని.. ఇక్కడ ఉన్న కాలువను ఆక్రమించి నిర్మాణం చేయడంతో ఇబ్బంది తలెత్తుతోందని స్థానికులు కమిషనర్‌కు వివరించారు. దీంతో వరద 6 అడుగుల మేర నిలిచిపోయి..ఆఖరుకు హుస్సేన్‌సాగర్ వరద కాలువకు దేవాలయం వద్ద ఉన్న రిటైనింగ్ వాల్ పడిపోయిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతాలను పర్యటించిన హైడ్రా కమిషనర్ వెంటనే రిటైనింగ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవడంతో పాటు.. అశోక్‌నగర్‌లో నాలాను విస్తరించాలని అధికారులను ఆదేశించారు. హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య, డీఎఫ్‌వోలు యజ్ఞనారాయణ, గౌతం, ముషీరాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రామానుజుల రెడ్డి, ఇరిగేషన్ డిప్యూటీ ఇంజినీరు శ్రీనివాస్ తదితరులు హైడ్రా కమిషనర్ పర్యటనలో ఉన్నారు.
About The Author
Advertise

