జర్నలిస్టుల సమస్యలపై సర్కారు ధ్వంద వైఖరి
కమిటీలు, కొత్త పాలసీల పేరుతో కాలయాపన
- తక్షణం పరిష్కరించకపోతే ఆందోళన తప్పదు
- టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
ఎల్బీ నగర్, సెప్టెంబర్ 18: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని, కమిటీలు, కొత్త పాలసీల పేరుతో ఊరిస్తూ కాలయాపన చేస్తుందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య విమర్శించారు. తమ ప్రభుత్వం జర్నలిస్టులకు అండగా ఉంటుందని పదే పదే చెప్పడమే తప్ప,అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరగా ఏం చేశారో, ఎక్కడ అండగా ఉన్నారో పాలకులు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం ఎల్బీనగర్ లో ఇటీవల ఎన్నికైన పలువురు డబ్ల్యూజేఎఫ్ కమిటీ నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ను మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకే అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన జర్నలిస్టులకు వైద్యం అందిస్తున్నారా? ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి జర్నలిస్టులకు సహాయం అందుతుందా? జర్నలిస్టుల కుటుంబాలు రోడ్డున పడుతున్నా పట్టించుకుంటున్నారా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు
కావస్తున్నా... ఇంత వరకు కొత్త అక్రిడిటేషన్ కార్డులిచ్చారా? చిన్న, మధ్య తరహా పత్రికలను ఏంప్యానల్ చేశారా జర్నలిస్టులకు అవార్డులు కాదు కదా, కనీసం సమయానికి ఆర్థికంగా ఆదుకుంటున్నారా? అని ప్రశ్నించారు. జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా,అక్రమ కేసులు బనాయిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని,
జర్నలిస్టులపై దాడులు చేసిన ప్రజాప్రతినిధులను రక్షిస్తున్న పోలీసులు తిరిగి జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సమాచార శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని, దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని అన్నారు. చిన్న పత్రికలు ఏంప్యానల్ మెంట్ కోసం కేసీఆర్ ప్రభుత్వం కాలం నుంచి వేచి చూస్తున్నాయని, కనీసం ఈ ప్రభుత్వ అయినా ఎంప్యానెల్ చేయడంలేదని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గత కేసీఆర్ ప్రభుత్వ పాలన విధానాలనే అనుసరిస్తుందని, అందులో ఎలాంటి మార్పు లేదని విమర్శించారు. కేసిఆర్ ప్రభుత్వంలో అక్రెడిటేషన్ కార్డుల జారీలో భారీగా అవకతవకలు జరిగాయని, వాటిని సరి చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రెండేండ్లు కూడా సరిపోకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడంలో కేసీఆర్ సర్కారును మరిపిస్తున్నారని, అంతేకాకుండా ప్రభుత్వ అధికారుల అవినీతిని వెలికితీస్తున్న జర్నలిస్టులను టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు.
జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పదేపదే అనడం తప్ప, చేసింది శూన్యమని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, అక్రెడిటేషన్ల జారీకి ప్రభుత్వం కొత్త పాలసీతో జీవో తీసుకురాబోతుందని, కొత్త జీవో ద్వారా అక్రెడిటేషన్ కార్డులను భారీగా తగ్గించబోతున్నట్లు తెలుస్తుందని, అదే జరిగితే వెంటనే రాష్ట్రవ్యాపిత ఆందోళన తప్పదని మామిడి సోమయ్య
హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పొట్లపల్లి అశోక్ కుమార్ గౌడ్, రంగారెడ్డి జిల్లా కమిటీ ప్రతిపాదిత సభ్యుడు సానెం శ్రీనివాస్ గౌడ్, ఎల్బీనగర్ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు రషీద్, అడ్వయిజర్ కిరణ్ తదితరులతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.
About The Author
Advertise

