అక్రమ విల్లాలపై చర్యలు తీసుకోవాలని - ఆకుల సతీష్, నల్ల జై శంకర్ గౌడ్ ఫిర్యాదు
మేడ్చల్ పెద్ద చెరువులో అక్రమాలు
మేడ్చల్ గ్రామంలో సర్వే నంబర్లు 879, 881 పరిధిలోని పెద్ద చెరువు ఎఫ్‌టిఎల్/బఫర్ జోన్‌లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటికి హెచ్ఎండిఏ నుంచి మాన్యువల్ అనుమతులు పొందడమే కాకుండా, చెరువులోనే నిర్మాణాలు జరుగుతున్నా మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా సహకరిస్తున్నారని గత నెలలోనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని. కానీ చర్యలు తీసుకోకపోవడంతో, సోమవారం అదనపు కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. మరోసారి మేడ్చల్ మున్సిపల్ మేనేజర్‌కు పూర్తి ఆధారాలతో పిర్యాదు అందజేశాం అన్నారు.
ఈ సందర్భంగా ఆకుల సతీష్ అలాగే నల్ల జై శంకర్ గౌడ్ మాట్లాడుతూ., శ్రేయస్ లైఫ్ స్పేసెస్ కన్స్ట్రక్షన్ కంపెనీ, మేడ్చల్ గ్రామంలో పెద్ద చెరువుకు ఆనుకొని సర్వే నంబర్లు 879, 881లో 24.31 ఎకరాల్లో (Proc. No.1064/MED/plg/HMDA/2022) విల్లాల నిర్మాణానికి అనుమతులు తీసుకోవడం జరిగిందన్నారు. చెరువు ఎఫ్‌టిఎల్/బఫర్ జోన్‌లో నిర్మాణాలకు మాన్యువల్ అనుమతులు హెచ్ఎండిఏ ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. ఇరిగేషన్ అధికారులు కూడా చెరువు పరిధిలో విల్లాల నిర్మాణానికి ఎన్వోసీ ఇవ్వడానికి కారణం, BRS పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు దాదాపు ₹100 కోట్ల పైచిలుకు పెట్టుబడులు పెట్టడమేనని ఆరోపించారు.
ఇప్పటికే చెరువులో 30 వరకు విల్లాలు అక్రమంగా నిర్మించబడుతున్నా, ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఎమ్మెల్యేల సహకారమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే BRS 2ఎమ్మెల్యేల అక్రమ పెట్టుబడులపై దర్యాప్తు జరిపి, మేడ్చల్ పెద్ద చెరువు ఎఫ్‌టిఎల్/బఫర్ జోన్‌లో మాన్యువల్ అనుమతులు ఇచ్చిన వ్యవహారంపై రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండిఏ అధికారులపై విజిలెన్స్ విచారణ జరపాలని, అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలని డిమాండ్ చేశారు. అలాగే శ్రేయస్ లైఫ్ స్పేసెస్ కన్స్ట్రక్షన్ కంపెనీపై క్రిమినల్ కేసు నమోదు చేసి, చెరువును పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరుణ్ రావు, పి.బి. శ్రీనివాస్, ముకేష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
Advertise

