దొంగలించిన మేకలు గొర్రెలు జియాగూడ మార్కెట్ లో అమ్మకం
షాద్ నగరులో ఏడుగురు సభ్యుల ముఠా అరెస్ట్ అనంతరం రిమాండ్
గత కొన్నేళ్లుగా రెండు జిల్లాలలో భారీగా మేకల, గొర్రెల దొంగతనం
రూ.2.62 లక్షల నగదు, నాలుగు వాహనాలు, 7 మొబైల్ లు, 4 కార్లు స్వాధీనం
మీడియా సమావేశంలో షాద్ నగర్ ఏసిపి ఎస్. లక్ష్మీనారాయణ వెల్లడి
షాద్ నగర్ : కార్లు వేసుకొని సాయంత్రం వేళ సరదాగా బయటికి వెళ్లాలి.. మేకలు, గొర్రెల గుంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతకాలి.. అర్ధరాత్రి అటాచ్ చేసి సైలెంట్ గా దోచేయాలి.. జియాగూడ మార్కెట్ కు తీసుకువెళ్లి అమ్మేయాలి.. చిల్లర దొంగతనాలకు అలవాటు పడ్డ యువత ఒక ముఠాగా మారి చేస్తున్న ఈ ఆగడాలకు షాద్ నగర్ పోలీసులు తెరదించారు. రెండు జిల్లాలలో వివిధ చోట్ల దొంగతనాలకు పాల్పడ్డ ఈ ముఠా కు సంబంధించిన వివరాలను ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ విజయ్ కుమార్ మీడియా సమావేశంలో తెలియజేశారు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం తో పాటు, కర్ణాటక , హైదరాబాదులోని పహాడీ షరీఫ్ ప్రాంతానిలకు చెందిన మహమ్మద్ ఫిరోజ్ (24), అబ్దుల్ కలీం (25), మొహమ్మద్ సోహెల్ (24), షేక్ రవూఫ్ (23), మహమ్మద్ జమీర్ (26), మహమ్మద్ ఆరిఫ్ (25), షేక్ హసీనుద్దీన్ (22), కోయల్ కార్ సాయికిరణ్ (30)లు ఈ దోపిడీ ముఠాలోని సభ్యులు. చిన్నతనం నుంచి చెడు స్నేహాలకు అలవాటు పడి మత్తుపదార్థాలకు బానిసలైన ఈ యువకులు డబ్బు కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందుకోసం నాలుగు వాహనాలను తమకు అందుబాటులో పెట్టుకున్నారు. ఆయా వాహనాలలో రోజు తిరిగి మేకలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికి రాత్రి కాగానే ఒక డీసీఎం తీసుకుని వెళ్లి మేకలను అందులో ఎక్కించి జియాగూడ మార్కెట్లో అమ్మి వేయడం వీళ్లు దినచర్యగా పెట్టుకున్నారు.
ఈ క్రమంలోనే షాద్ నగర్ పరిధిలో చించోడులో 28, వెలిజర్లలో 8, చౌదరిగుడాలో 8, ఎల్కిచర్లలో 23, కొందుర్గు మండలం తంగెడపల్లిలో 8, వెంకిర్యాలలో 9, పరిగి మండలంలో కోటివాడలో 12, సుల్తాన్ పూర్ లో 30, దోమ మండలం వుదంతారావు పల్లి లో 15, జధిరసం పల్లిలో ఆరు మేకలు, గొర్రెలను దొంగిలించారు. ఇదే రీతిన ఈనెల 14వ తేదీన పురపాలక పరిధిలోని సోలిపూర్ వద్ద దొంగతనానికి పాల్పడుతుండగా షాద్ నగర్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. శంషాబాద్ డిసిపి రాజేష్ పర్యవేక్షణలో సాగిన ఈ విచారణ సిపిఎస్ డిసిపి ముత్యంరెడ్డి, అడిషనల్ డీసీపీ పూర్ణచంద్రరావు, శంషాబాద్ అడిషనల్ డీసీపీ రామ్ కుమార్, శ్రీలక్ష్మి ల నేతృత్వంలో విచారణ కొనసాగింది. షాద్ నగర్ ఏసిపి లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ విజయ్ కుమార్,డిటెక్టివ్ సిఐ వెంకటేశ్వర్లు లో ఆధ్వర్యంలో ఎస్సై లు పవన్ కుమార్, అవినాష్ బాబు, శ్రీనివాస్, భూపాల్, శివారెడ్డి, సిబ్బంది కుమార్, మహేందర్, జాకీర్, నవీన్, రమేష్, రవి, భీమయ్య, రవీందర్, కరుణాకర్, మోహన్ లాల్, జాకీర్, రాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
About The Author
Advertise

