అభివృద్ధి పేరుతో కాంట్రాక్టు పనులకు శంకుస్థాపనలేనా ?
ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
నర్సంపేట డిసెంబర్ 5 ( నమస్తే భారత్ ) :
నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి పేరుతో 500 కోట్ల రూపాయల శంకుస్థాపనలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పేరుతో కాంట్రాక్టు పనులకు శంకుస్థాపనలేనా అన్నట్టుగా ఉందని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ ప్రశ్నించారు. నర్సంపేట ఓంకార్ భవన్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో పెద్దారపు రమేష్ మాట్లాడుతూ త్యాగాలకు ఆదర్శాలకు రాజకీయ విలువలకు దిక్సూచిగా నిలిచి ఐదుసార్లు నర్సంపేట ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రజల పక్షాన గొంతు విప్పి అసెంబ్లీ టైగర్ గా పేరుగాంచిన అమరజీవి మద్దికాయల ఓంకార్ పేరును విస్మరించి కేవలం ప్రచార ఆర్భాటం, శంకుస్థాపనల పేరుతో రాజకీయ ప్రచారం కోసం సీఎం రేవంత్ రెడ్డి తాపత్రయపడుతున్నట్లు కనపడుతున్నది తప్ప చిత్తశుద్ధితో ప్రజలకు అవసరమైన అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు లేదన్నారు. రాష్ట్రంలోనే నర్సంపేట నియోజకవర్గం ఎంతో చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగినదని ఈ క్రమంలో పాలకుల నిర్లక్ష్యం మూలంగా వెనుకబడి పోతున్నదని అకాల వర్షాలు మోంత తుఫాను యూరియా కొరకతో పంటల దిగుబడి తగ్గి రైతాంగం తీవ్రమైన ఆర్థిక సంక్షేమంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు.అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయి ఉన్నా రైతులకు పరిహారం గత యాసంగి బోనస్ ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు పదివేల రూపాయల పరిహారం ఇస్తామని ప్రకటించి నేటికీ ఇవ్వలేదని గత యాసంగి సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాకు 500 రూపాయల బోనస్ డబ్బులు రాలేదని ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని పోడు రైతులకు హాక్కుపత్రాలు, నిలువ నీడ కోసం ప్రభుత్వ భూములో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు గత రెండేళ్లలో ఒక్కరికి ఇవ్వలేదని ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్న వాటి గురించి మాట్లాడకుండా పరిష్కారం చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం వెయ్యి కోట్ల రూపాయలు శంకుస్థాపనలు చేసినప్పటికీ రైతులకు కూలీలకు కార్మికులకు మహిళలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. అలాగే రాజకీయ విలువలకు త్యాగాలకు ఆదర్శాలకు నిలువెత్తు నిదర్శనమైన మహానేత కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ జీవిత ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించే విధంగా వారి స్ఫృతులను ఏర్పాటు చేయాలని అందులో భాగంగా నర్సంపేట మెడికల్ కాలేజీకి, నర్సంపేట స్టేడియంకు, నర్సంపేట నుంచి వరంగల్ రోడ్డుకు కామ్రేడ్ ఓంకార్ పేరుతో నామకరణం చేయాలన్నారు. అలాగే ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించి స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజా పాలనలో అక్రమ అరెస్టులు సిగ్గుచేటు అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో ప్రజా సమస్యలను విన్నవించడానికి అవకాశం కల్పించకుండా ప్రజా సమస్యలపై పోరాడే ఎంసిపిఐయు రాష్ట్ర జిల్లా నాయకులు కుసుంబా బాబురావు కన్నం వెంకన్న సింగతి మల్లికార్జున్ బుడమే సురేందర్ లాంటి నాయకులను అరెస్టు చేయడం అన్యాయం అన్నారు. తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేరుకు ప్రజాపాలన అంటూ ఆచరణలో నియంతృత్వాన్ని ప్రదర్శించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లిందన్నారు.
ఈ సమావేశంలో ఎంసిపిఐ(యు) పార్టీ రాష్ట్ర నాయకులు కన్నం వెంకన్న వంగల రాగసుద జిల్లా నాయకులు కేశెట్టి సదానందం కర్నే సాంబయ్య జన్ను రమేష్ తదితరులు పాల్గొన్నారు.
