TWJF : బసవపున్నయ్య శాశ్వత బహిష్కరణ
ఫెడరేషన్ ద్రోహి అంటూ మండిపాటు - 15న రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం
హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ లో అనేక అక్రమాలకు అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్న ప్రధాన కార్యదర్శి BASAVAPUNAIAH సంఘ ద్రోహి అని, అతనిని ఫెడరేషన్ యూనియన్ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నట్లు పలువురు ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు, వ్యవస్థాపక సభ్యులు ప్రకటించారు. గురువారం హైదరాబాద్ లో TWJF రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయకుమార్, వల్లాల జగన్, రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు,కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితాడి బాపురావు,సీనియర్ జర్నలిస్టులు, వ్యవస్థాపక సభ్యులు ఎం.యాదగిరి, కే. సారంగపాణి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అశోక్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడినైన మామిడి సోమయ్యతో పాటు మరో నలుగురు సీనియర్ నాయకులు, వ్యవస్థాపక సభ్యులను సంఘం నుంచి బహిష్కరించినట్లు బసవపున్నయ్య ప్రకటించడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది.

రాష్ట్ర కార్యవర్గం జరగకుండానే జరిగినట్లు అబద్ధపు వార్తలు సృష్టించి ప్రకటన చేయటం హాస్యాస్పదమని, బైలా ప్రకారం సంఘం అధ్యక్షుడిని, ఇతర ఆఫీస్ బేరర్లను బహిష్కరించేందుకు కార్యవర్గానికి గానీ, సంఘ ప్రధాన కార్యదర్శికి గానీ ఎటువంటి హక్కు లేదని సమావేశంలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు. సంఘం రాష్ట్ర కమిటీ కాలపరిమితి ముగిసిందని,కొత్త కమిటీని ఎన్నుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయకుండా, విస్తృత సమావేశం ఏర్పాటు చేయాలన్న అధ్యక్షుడి విజ్ఞప్తిని పట్టించుకోకుండా తన పదవిని కాపాడుకునేందుకు బసవ పున్నయ్య అడ్డదారులు తొక్కుతున్నారని ధ్వజమెత్తారు.
దీనిపై ఇప్పటికే ఆయనకు లీగల్ నోటీస్ కూడా జారీ చేయటంతో పాటు లీగల్ నోటీసు సంబంధించి పబ్లిక్ నోటీస్ కూడా వార్తాపత్రికల్లో ప్రచురించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో బెంబేలెత్తి పోయిన బసపున్నయ్య హడావిడిగా ఈ ప్రకటన జారీ చేశారని అన్నారు. ఇది చెల్లదని, ఒకవేళ సంఘంలో జరుగుతున్న పరిణామాలకు ఆయన lసమాధానం చెప్పదలుచుకుంటే లీగల్ నోటిస్ కు సమాధానమిచ్చి లేబర్ కమిషనర్ కు తెలియజేసి, తన వాదనను వినిపించాలని అన్నారు. సంఘం ఎవరిదో... దాంట్లో ఎవరికి ఏమేమి హక్కులున్నాయో...వాటిని సాధించుకోవచ్చని, అది చేయకుండా మతిభ్రమించి... సంఘం కోసం, జర్నలిస్టుల హక్కుల కోసం కృషి చేస్తున్న నాయకులను, బహిష్కరిస్తున్నామని ప్రకటించడం దుర్మార్గమని అన్నారు. మహాసభ నిర్వహించే గడువు దాటిపోయి సంవత్సరం అవుతున్నా, తర్వాత కూడా మహాసభ నిర్వహించకుండా కాలయాపన చేస్తూ, అతనే సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పునాదులు వేసి, సమావేశాలు నిర్వహించకుండా, బాధ్యత రహితంగా ప్రవర్తిస్తూ, అధ్యక్షునితో ఏ విధమైన సంబంధాలు లేకుండా, మాట్లాడకుండా, శత్రువుగా తయారై... ఈ అక్రమ చర్యలకు పాల్పడుతున్నాడని అన్నారు. సంఘం ఆర్థిక లావాదేవీల విషయంలో పదేళ్లుగా బసవపున్నయ్య అనేక అక్రమాలకు పాల్పడి సభ్యులకు లెక్కలు చెప్పకుండా నిధుల దుర్వినియోనికి పాల్పడిందే కాకుండా ప్రత్యారోపణలు చేస్తూ మొండిగా, మూర్ఖంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. అంతేకాకుండా సంఘాన్ని బలోపేతం చేయకుడా, కార్యక్రమాలు నిర్వహించకుండా సంఘాన్ని కుంటుపరిచాడని అన్నారు. సంఘం విచ్చిన్నం కావడానికి బాధ్యుడు బసవపున్నయ్యనే అని, ఆయనపై చర్యలు తీసుకునేందుకు, సంఘం బాధ్యతల నుండి తప్పించేందుకు సభ్యులంతా ఆలోచిస్తున్న తరుణంలో ఈ చర్యలకు పాల్పడి సంఘాన్ని ఆబాసు పాలు చేయడానికి పూనుకున్నాడని అన్నారు. రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని అధ్యక్షుడు చేసిన విజ్ఞప్తిని, లిఖిత పూర్వకంగా పంపిన నోటీసులను ఖాతరు చేయకుండా, ఎటువంటి సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడని అన్నారు. ఇది చాలా పెద్ద తప్పిదమని, ఫెడరేషన్ లో 18 ఏళ్ళు ప్రజాశక్తి, నవతెలంగాణ పత్రిక ప్రతినిధిగా బసవపున్నయ్యకు పెద్ద పీట వేసామని గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధ్యక్షులుగా, తెలంగాణలో ప్రధాన కార్యదర్శి గా, రాష్ట్ర అక్క్రిడిటేషన్ కమిటీ సభ్యులుగా అతనికి అవకాశం ఇచ్చామని అన్నారు. 18 ఏళ్ళు సభ్యులను మోసం చేశాడని, సంఘంలో ఏ ఒక్క జర్నలిస్టుకు న్యాయం చేయలేదని అన్నారు. గత రాష్ట్ర మహాసభలో ప్రజాస్వామ్య బద్దంగా ఫెడరేషన్ కు ఎన్నికలు జరగాలని కోరినా వినకుండా దుర్మార్గంగా వ్యవహరించాడని అన్నారు.18 ఏళ్ళ పదవీ కాలంలో "తొండ ముదిరి ఊసరవెల్లి" అయినట్లు అధికార దాహం పట్టుకుని, ఫెడరేషన్ ను నిర్మాణం చేసిన వారి మీద గర్జించడం ప్రారంభించడని అన్నారు. చివరికి రాష్ట్ర కమిటీని తనే రాసుకునే స్థాయికి ఎదిగాడని మండిపడ్డారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన రాష్ట్ర మహాసభలను గడిచిన పదకొండేళ్ళలో కేవలం ఒక సారి మాత్రమే మహాసభను నిర్వహించాడని చెప్పారు
అప్రాజస్వామికంగా వ్యవహరిస్తున్న పున్నయ్య
టిడబ్ల్యూజేఎఫ్ కు సేవకుడుగా కాకుండా, పెత్తనం చేసే వ్యక్తిగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ఆయన వ్యవహారం, పనితీరుపై పలుమార్లు ఆయన పనిచేస్తున్న సంస్థ అధిపతులకు, పెద్దలకు కూడా వివరిస్తూ లిఖితపూర్వకంగా తెలియజేసినప్పటికీ ఏ విధమైన మార్పు రాలేదని అన్నారు. ఈ గందరగోళ పరిస్థితుల పట్ల సంఘం సభ్యులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, దీనిపై ఇప్పటికే చర్చించేందుకు విస్తృతస్థాయి సమావేశం ఈనెల 15వ తేదీన హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అన్ని విషయాలపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని
అన్నారు. సంఘం కార్యకలాపాలను ముందుకు తీసుకుపోయేందుకు మహాసభలు జరగని జిల్లాల్లో మహాసభలు జరపడం జరుగుతుందన్నారు. అదే విధంగా సంఘాన్ని విచ్చినం చేస్తూ, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, ఓల్లాల జగన్, రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, రాష్ట్ర వ్యవస్థాపక సభ్యులు యాదగిరి, సీనియర్ జర్నలిస్టు సారంగపాణి, కరీంనగర్ జిల్లా కార్యదర్శి బాపురావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Publisher
Namasthe Bharat
