రోడ్డెక్కిన మహిళలు రాస్తారోకో
నాగారం మున్సిపాలిటి వరద ముంపు సమస్యపై మహిళల నిరసన
శాశ్వత పరిష్కారం చూపాలని 22 కాలనీల వాసుల డిమాండ్
మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 22 కాలనీల ప్రజలు వరద ముంపు సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి వర్షాకాలంలో తమ నివాస ప్రాంతాలు నీట మునిగిపోతుండటంతో, బహిరంగ రహదారులు కాలువలుగా మారుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో, సోమవారం ఉదయం పెద్ద సంఖ్యలో మహిళలు కలిసి నాగారం మెయిన్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.మురికి నీటికి శాశ్వత పరిష్కారంగా మెయిన్ రోడ్డు వెంబడి పక్కా మురికి కాల్వ నిర్మించాలని డిమాండ్ చేశారు.
వర్షాకాలంలో పైనుండి వచ్చే వరదలతో 22 కాలనీలు పూర్తిగా ముంపుకు గురవుతున్నాయని అన్నారు.తక్షణమే అధికారులు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి,డ్రైనేజీ ని నిర్మించాలని డిమాండ్ చేశారు.ఈ రాస్తారోకోలో బీఎంఆర్ కాలనీ, సాయి రత్న కాలనీ, ఎస్‌ఎల్‌ఎన్ కాలనీ, తివారి ఎంక్లేవ్, అరవింద నగర్ కాలనీ, మనీ ఎంక్లేవ్, వీఆర్ నగర్ కాలనీ, సాయి సంజీవ్ నగర్, బిపిసి, బీబీసీ కాలనీ తదితర కాలనీల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అనంతరం కాలనీ వాసులు మాట్లాడుతూ ఈకాలనీల ప్రాంతాల్లో వరదనీరు ఇళ్లలోకి ప్రవేశించడం, రోడ్లు గుంతలు కావడం వంటి సమస్యలు కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్నాయని, మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ పిల్లలు స్కూళ్లకు వెళ్లలేకపోతున్నారని, వృద్ధులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని మహిళలు మున్సిపల్ అధికారులను డిమాండ్ చేసారు.అనంతరం మున్సిపల్ కార్యాలయం వినతి పత్రం అందించారు.
About The Author
Advertise

