జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై డిసెంబర్ 3న మహా ధర్నా
నమస్తే భారత్ షాద్ నగర్ డిసెంబర్02: జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నది. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత 12 సంవత్సరాల కాలంలో అత్యంత నిరాదరణకు గురైన వర్గం జర్నలిస్టులేననడంలో ఎంత మాత్రం సందేహం లేదు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన జర్నలిస్టుల జీవితాలు గత పుష్కర కాలంలో ఏ మాత్రం మెరుగు పడలేదు. ఉమ్మడి రాష్ట్రంలో పొందిన ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు సైతం అందకుండా పోయాయి. నాడు పోరాటాల ద్వారా సాధించుకున్న అనేక వృత్తి సౌకర్యాలు సైతం మాయమైపోయాయి. ఉద్యమ కాలంలోనూ, ఆ తర్వాత పదేళ్ల పాలసలోనూ బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమైపోయాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదే బాటలో పయనిస్తున్నది. నూతన పాలసీని రూపొందించి అక్రెడిటేషన్లు జారీ చేయడం, ఆరోగ్య భద్రత కల్పించడం, ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం, అనేక వృత్తి కమిటీలను పునరుద్ధరించడం వంటి కనీస సౌకర్యాలు కల్పనలో ప్రభుత్వం తీవ్రమైన అలక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. మీడియా విషయాలను పట్టించుకోవాల్సిన సమాచార శాఖ కమిషనర్లను తరచూ మార్చడం, ఆ శాఖను నిర్వహిస్తున్న మంత్రి దాని మీద దృష్టి సారించకపోవడం జర్నలిస్టులలో ఆందోళన కలిగించింది. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో సమాచార శాఖ పూర్తిగా విఫలమైంది. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) ప్రతినిధి బృందాలు గత రెండేళ్ల కాలంలో సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని అనేక దఫాలు కలిసి జర్నలిస్టుల సమస్యలపైన, సంక్షేమంపైన విజ్ఞాపన పత్రాలు సమర్పించాయి. కలిసిన ప్రతిసారీ మంత్రి స్పష్టమైన హామీలు ఇచ్చినప్పటికీ అవి కార్యరూపం దాల్చకపోవడం విచారకరం. అంతేకాకుండా గడిచిన రెండేళ్ల కాలంలో సమాచార శాఖ కమిషనర్లకు పలుమార్లు వినతి పత్రాలు అందించినా ఎలాంటి స్పందన లేదు. ప్రభుత్వ వైఖరి పట్ల రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో సహా 33 జిల్లాల్లో జర్నలిస్టుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీనితో ప్రత్యక్ష కార్యాచరణకు దిగక తప్పని పరిస్థితి ఏర్పడింది.మన న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి పోరుబాట పట్టాలని నవంబర్ 6, 2025న జరిగిన యూనియన్ రాష్ట్ర కార్యవర్ధ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా మాసాబ్ ట్యాంక్, హైద్రాబాద్ లోని రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద డిసెంబర్ 3వ తేదీ, ఉదయం 10 గంటలకు మహా ధర్నా నిర్వహించాలని టియుడబ్ల్యూజే నిర్ణయించింది. మన డిమాండ్ల సాధన కోసం ఈ ఆందోళన కార్యక్రమంలో రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి జర్నలిస్టులు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
మన డిమాండ్లు:
1. అక్రెడిటేషన్ పాలసీని వెంటనే ప్రకటించి కొత్తకార్డులు జారీ చేయాలి.
2. ఆరోగ్య బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలి.
3. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు మంజూరు చేయాలి.
4. వృత్తి కమిటీలు వెంటనే ఏర్పాటు చేయాలి.
5. సంక్షోభంలో ఉన్న చిన్న, మధ్యతరగతి పత్రికలను ఆదుకోవాలి.
విరాహత్ అలీ రాష్ట్ర అధ్యక్షుడు
ఉద్యమాభివందనాలతో...
కె. రాంనారాయణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) కరపత్రం విడుదల చేశారు.
బుధవారం షాద్ నగర్ నుండి రాష్ట్ర నాయకులు గుడుపల్లి శ్రీనివాస్ (పేపర్ శీనన్న) ఆధ్వర్యంలో జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని మహా ధర్నాను విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము.
