ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
నర్సంపేట డిసెంబర్ 2 (నమస్తే భారత్ ) :
గ్రామపంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
మంగళవారం నర్సంపేట ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, మూడవ విడతలో నర్సంపేట రెవెన్యూ డివిజన్ లోని ఖనాపూర్, చెన్నారవుపేట, నర్సంపేట, నెక్కొండ మండలాల్లోని గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డ్ సభ్యులకు నామినేషన్ స్వీకరణ జరగనున్న దృష్ట్యా నామినేషన్‌ల స్వీకరణలో రిటర్నింగ్ మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎటువంటి లోపాలు లేకుండా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని క లెక్టర్ సూచించారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి దశ అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొంటూ, నామినేషన్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని, అభ్యర్థులు మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నామినేషన్‌ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్ వంటి ప్రతి కార్యక్రమం ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, జిల్లా ప్రత్యేక అధికారి, పశుసంవర్ధక శాఖ అధికారి బాలకృష్ణ, నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, ఎంపీడీవోలు, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు
