జల్ సంచయ్–జన్ భాగీదారీ జాతీయ అవార్డును సాధించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పటిల్ చేతుల మీదుగా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అవార్డు స్వీకరణ
నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 18_) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నీటి సంరక్షణలో సాధించిన విశేషఫలితాలకు గానూ ప్రతిష్ఠాత్మక ‘జల్ సంచయ్–జన్ భాగీదారీ’ (JSB) జాతీయ అవార్డును కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ సి.ఆర్. పటిల్ గారి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, డీఆర్డీవో విద్యా చందన తో కలసి మంగళవారం న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో స్వీకరించారు.
జిల్లా వ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యం, శాఖల సమన్వయంతో 29,103 నీటి సంరక్షణ పనులు పూర్తి చేయడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయస్థాయి మూడో జోన్‌లో కేటగిరీ–3లో రాష్ట్రంలో మొదటి స్థానం సాధించింది. ఈ విజయానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం రూ.25 లక్షల నగదు బహుమతి ప్రకటించింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చిన ప్రజల భాగస్వామ్యం, గ్రామస్థాయి సంస్థల చురుకుదనం, శాఖల సమన్వయం కారణంగానే ఈ జాతీయ అవార్డు సాధ్యమైంది. జల్ సంచయ్–జన్ భాగీదారీ కార్యక్రమం కేవలం ప్రభుత్వ ప్రాజెక్ట్ కాకుండా, నీటి విలువపై ప్రజల్లో అవగాహన పెంచిన సామూహిక జల సంరక్షణ ఉద్యమంగా మారింది అని అన్నారు.
జిల్లాలో చేపట్టిన జల సంరక్షణ పనులు భూగర్భ జలాల పెంపు, చెరువులు–వాగుల పునరుద్ధరణ, వ్యవసాయ నీటి భద్రతను గణనీయంగా మెరుగుపరిచాయి అని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఇంకుడు గుంతల త్రవ్వకాన్ని భారీ ఎత్తున చేపట్టడం ద్వారా వర్షపు నీరు వృథాగా కాకుండా భూగర్భ జలాలుగా మారేందుకు, ప్రతి ప్రభుత్వ కార్యాలయం, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, రోడ్లు పక్కన నీరు నిల్వ అయ్యే ప్రదేశాలు, గ్రామ స్థాయి సంస్థల వద్ద ఇంకుడు గుంతలను విస్తృతంగా ఏర్పాటు చేశాము అని తెలిపారు.
ఈ ఇంకుడు గుంతలు వర్షపు నీటిని నేలలోకి వెళ్లి, గ్రామాల్లో నీటి లభ్యతను పెంచడంలో, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషించాయి అని అభిప్రాయపడ్డారు. శాఖలన్నీ సమన్వయంతో పనిచేయడం, గ్రామస్థాయి ప్రజల అంకితభావం ఈ విజయానికి ప్రధాన కారణం. భవిష్యత్తులో కూడా చెరువుల పునరుద్ధరణ, వాగుల అభివృద్ధి, వర్షపు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం వంటి చర్యలను మరింత వేగవంతం చేస్తాము అని కలెక్టర్ అన్నారు.
డీఆర్డీవో విద్యా చందన మాట్లాడుతూ—
గ్రామస్థాయిలో నీటి సంరక్షణపై విస్తృత అవగాహన, పనుల నాణ్యత, శాఖల సమన్వయం కలిసి జాతీయస్థాయి గుర్తింపుకు దోహదపడ్డాయి. ఈ విజయం మొత్తం జిల్లా బృందం కృషికి ప్రతీక అని తెలిపారు.
