శుభ వాస్తు
ఇంటి ప్లాను సొంతంగా మార్చుకొని కట్టుకొనేటట్లు అయితే.. ఆ ప్లాను తీసుకోవడం ఎందుకు? మీరే ఇష్టం వచ్చిన ప్లాను వేసుకొని కట్టుకోవచ్చు కదా! ఎవరు వద్దంటారు. మీ ఇల్లు మీ ఇష్టం కదా! శాస్త్రం ప్రకారం కట్టాలి అనుకుంటే.. దానిని పూర్తిగా అనుసరించాలి. ఏదో తంతుకోసం ప్లాను తీసుకొని, అందులో ఎన్నో మార్పులు చేసి, కట్టేటప్పుడు ఎవరో చెబితే.. మళ్లీ మార్చి. కాదుకాదు.. అని ఈశాన్యం ఖాళీగా ఉండాలని.. డ్రాయింగ్ రూమును కారు పార్కింగ్ చేసి ఇల్లు కడితే.. దానికి ఔన్నత్యం ఉంటుందా? దాన్ని శాస్త్రగృహం అని అంటారా? ఆ గృహం శుభాలు కలిగిస్తుందా? ‘ఎంతశాతం వాస్తు ఉండాలి?’ అనేది ఏంటి? వందశాతం శాస్ర్తానికి ఉంటేనే.. చెడు కర్మ ఫలితాలు అణిగిమణిగి ఉంటాయి. ఇక మీరు ఆ ప్లానులో మార్పు చేస్తే.. అందులో వాస్తు ఎలా ఉంటుంది? మీరేకాదు.. చాలామంది యజమానులు తెలిసీతెలియక మార్పులు చేస్తూ పోతుంటారు.
పడమర ఖాళీ వదిలి.. అటు జాగ ఉందికదా అని మాస్టర్ బెడ్‌రూముకు అటాచ్డ్ బాత్‌రూమును పశ్చిమం స్థలంలోకి జరిపి కడుతారు. లిఫ్ట్‌ను తూర్పులో పెట్టి, దాని వెనక భాగం పూజగది చేస్తారు. వాళ్ల దృష్టిలో.. ఇది మంచిదే కదా! అనుకుంటారు. మంచి చెడ్డలు నిర్ణయించాల్సింది మనంకాదు.. శాస్త్రం! దాని పరిపూర్ణ ప్రయోగజనిత ఫలమే గృహం. అప్పుడు ఆ గృహమే సౌభాగ్య నిలయం అవుతుంది.
శాతాల మీద ఆధారపడి శాస్త్రం ఉండదు. అంత పెద్ద సీసా నిండా తేనె ఉన్నా, అందులో ఒక్క నీటిచుక్క పడితే చాలు.. తేనె మొత్తం పాడైపోతుంది. లేదంటే ఆ తేనె వేల సంవత్సరాలు అయినా చెడిపోదు. అలా.. శాస్త్ర స్వభావం కూడా అంతే! మన సొంత తెలివిని దేంట్లోనూ వాడకూడదు. అది బెడిసి కొడుతుంది. ఇంటి ప్లాను ప్రకారం ఇంటి నిర్మాణం జరుగుతున్నదా? లేదా అనేది చూస్తూ ఇంటిని కట్టుకోండి. అదే మిమ్మల్ని గట్టుకు చేరుస్తుం ది.