మేషం: (అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం),
మేషరాశి వారికి ఈ ఏడాది ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. గృహనిర్మాణం, స్థలసేకరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకు చదువుల కోసం వెళ్లేందుకు, విదేశీ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. బాంధవ్యాలు పెంపొందుతాయి. ఖర్చులు అంచనాలు మించుతాయి. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. మీ జన్మరాశి నుంచి 2, 3 స్థానాల్లో గురుగ్రహ సంచారం కారణంగా స్థిరచరాస్తులు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. వ్యాపారాల్లో లాభాలకు, ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. కుటుంబ వ్యవహారాలు ఆనందం కలిగిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. తోబుట్టువుల వ్యవహారాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. విద్యాసంస్థలు, కన్సల్టెన్సీ, ఏజెన్సీల వారికి శుభప్రదం. కోర్టు వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. సంవత్సరం ప్రారంభం నుంచి ఫిబ్రవరి 5 వర కు, ఆ తరువాత నవంబరు 12 నుంచి సంవత్సరాంతం వరకు గురువు వక్రగమనంలో ఉంటాడు. ఆ సమయంలో ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. ఉద్యోగ, వ్యాపారాల్లో నిదానం పాటించాలి. రవాణా, కన్సల్టెన్సీ, విద్యారంగాల వారు జాగ్రత్తగా ముందడుగు వేయాలి. డ్రైవింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు కుంభంలో ఆ తరువాత మీనంలో శని సంచారం జరుగుతుంది. ఫలితంగా పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. రుణబాధలు అధికం. ఆరోగ్యం మందగిస్తుంది. మోకాళ్లు, కండరాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలు బాధిస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వైద్యం, శాస్త్ర సాంకేతిక రంగాలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారస్తులు జాగ్రత్త వహించాలి. జూలై14 నుంచి నవంబర్ 28 వరకు శని వక్రగమనంలో ఉన్న సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ ఎక్కువైనా చివరకు విజయం సాధిస్తారు. ఈ ఏడాది 12-6 స్థానాల్లో రాహు కేతువుల సంచారం కారణంగా అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. అపార్థాలు, ఆవేశాల కారణంగా సంబంధాలు దెబ్బ తింటాయి. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. రుణ ప్రయత్నాలు అంతగా ఫలించకపోవచ్చు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని మాటపడాల్సి వస్తుంది. శ్రీఆంజనేయ స్వామి ఆరాధన శుభఫలితానిస్తుంది.