వడ్డెరల సంక్షేమమే మా సంకల్పం – సీతక్క, పొంగులేటి
జాతీయ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వడ్డెరల ఆత్మీయ సమ్మేళనం
హైదరాబాద్, నవంబర్ 8:జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ జయశంకర్ కమ్యూనిటీ హాల్లో జాతీయ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వడ్డెరల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ (సీతక్క), రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్, డిప్యూటీ స్పీకర్ రామచంద్రూ నాయక్, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జేరిపాటి జైపాల్, ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా ఎఫ్ఫెనెండి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ లు హాజరయ్యారు.జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వడ్డెర సమాజానికి సంబంధించిన పలు కీలక డిమాండ్లను వివరించారు. వడ్డెరలను ఎస్‌టీ జాబితాలో చేర్చడం, ప్రతి వడ్డెరకు ఉచిత లేబర్ కార్డులు, 50 ఏళ్ల పైబడిన వారికి పింఛన్లు, ప్రమాద బీమా, వడ్డెర గురుకులాల స్థాపన, ఉచిత వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, వడ్డెర కార్పొరేషన్‌కు 1000 కోట్ల బడ్జెట్, మైనింగ్ మరియు ప్రభుత్వ పనుల్లో 20% రిజర్వేషన్, క్రషర్లు, కంప్రెసర్లు, జెసిబీలకు 50% సబ్సిడీ, భూముల కేటాయింపు, మౌలిక వసతులు, రాజకీయ ప్రాధాన్యం వంటి 14 ప్రధాన డిమాండ్లను వారు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, “రక్తం చెమట చిందించి రాళ్లను కొట్టి నిర్మాణాలకు పునాది వేసిన వడ్డెర్లు హైదరాబాద్ అభివృద్ధికి వెన్నెముక లాంటి వారన్నారు. పీజేఆర్ కాలంలో వడ్డెర్లకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని, కానీ టీఆర్‌ఎస్ పాలనలో అవి రద్దయ్యాయన్నారు. ఇప్పుడు పక్కా ఇళ్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది” అని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, “హైదరాబాద్‌లో వడ్డెర్లకు 5 ఎకరాల స్థలం కేటాయిస్తామని, లేబర్ కార్డులు, ప్రమాద బీమా పథకాలు త్వరలో అమల్లోకి వస్తాయన్నారు. మంత్రి అజారుద్దీన్, “వడ్డెరల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ ఏకస్వరం గా వడ్డెర సంఘం డిమాండ్లు న్యాయమైనవని వాటిని అంగీకరించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జాతీయ వడ్డెర సంఘం నాయకులు వల్లెపు శివకుమార్, గుంజ రేణుక, వేముల యాదయ్య, వల్లెపు నరసింహారావు, పల్లపు సమ్మయ్య, గుంజ నారాయణ, బత్తుల లక్ష్మీకాంతయ్య, వేముల భరత్, బోదాసు రవి, వేముల సత్యం, పల్లపు రమేష్, జెరిపాటి రాజు, వల్లెపు గిరీష్, గుంజ ఆంజనేయులు, దండగుల శేఖర్, బండారి కుమార్, బోదాసు కృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు.
