ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారులో పేలుడు.. 8 మంది మృతి, పలువురికి గాయాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు మోత మోగింది. ఎర్రకోట సమీపంలోని కారులో పేలుడు సంభవించింది. (Blast In Delhi) పలు వాహనాలకు మంటలు వ్యాపించాయి. 8 మంది మరణించారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సోమవారం సాయంత్రం 6.45 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో పార్క్ చేసిన కారులో పేలుడు సంభవించింది. ఐదుకుపైగా వాహనాలు మంటల్లో చిక్కుకుని కాలిపోయాయి. సమీపంలోని షాపులు కూడా ధ్వంసమయ్యాయి. ఈ పేలుడులో 8 మంది మరణించారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నది.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపుచేశారు. ఫోరెన్సిక్ నిపుణులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు కారణాన్ని తెలుసుకోనేందుకు ఆధారాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఉగ్రవాద దాడుల కుట్ర నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. భారీస్థాయిలో పేలుడు పదార్థాలు, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తరుణంలో ఢిల్లీలో పేలుడు జరుగడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో హైఅలెర్ట్ ప్రకటించారు. ఈ పేలుడుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
