హైడ్రా కమీషనర్ రంగనాధ్ - ముంపు ప్రాంతాల పర్యటన
నీట మునిగి మునిగిన ఏరియాల్లో శాశ్వత పరిష్కారం చూపాలంటూ GHMC అధికారులకు ఆదేశం
నగరంలో నీట మునిగిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌గారు గురువారం పరిశీలించారు. అమీర్‌పేటలోని గాయత్రి కాలనీ, మాధాపూర్‌లోని అమర్ సొసైటీ, బాగ్‌లింగంపల్లి లోని శ్రీరాంనగర్‌లలో హైడ్రా కమిషనర్ పర్యటించారు. అమీర్‌పేట వద్ద కాలువల్లో పూడిక తీయడంతో సాఫీగా వరద సాగుతోందని ఇదే మాదిరి నగరంలోని అన్ని చోట్ల నీటి మునకకు మూలాలను తెలుసుకుని సమస్య పరిష్కరించాలని హైడ్రా కమిషనర్ సూచించారు. పై నుంచి భారీ మొత్తంలో వస్తున్న వరద నీరు మైత్రి వనం వెనుక ఉన్న గాయత్రినగర్‌ను ముంచెత్తుతోందని.. ఇక్కడ కూడా కాలువలలో సిల్ట్ తొలగించి వరద ముప్పు సమస్యతను తొలగించాలని అక్కడి నివాసితులు కమిషనర్‌ను కోరారు. పై నుంచి నాలాల్లో పూడిక తీసుకుని వస్తున్నామని.. ఇక్కడ కూడా పరిష్కార చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఏవీ రంగనాథ్‌గారు హామీ ఇచ్చారు.
దుర్గం చెరువులో నీటిమట్టం తగ్గించాలి..
దుర్గం చెరువులో నీటి మట్టం పెరగడంతో పై భాగంలో ఉన్న అమర్ సొసైటీతో పాటు అనేక కాలనీలుకు వరదనీరు పోటెత్తుతోందని స్థానికులు కమిషనర్ ఏవీ రంగనాథ్ గారికి తెలిపారు. చెరువు నీటి మట్టం తగ్గిస్తే కొంతవరకు సమస్య పరిష్కారమౌతుందని సూచించారు. ఈ విషయమై ఇరిగేషన్, జీ హెచ్ ఎంసీ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. క్లౌడ్ బరస్ట్ తో అనూహ్యంగా గంట వ్యవధిలోనే 15 సెంటీమీటర్లకు పైగా వర్షం పడడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. ఆ పరిస్థితులను తట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కమిషనర్ సూచించారు.
శ్రీరాంనగర్ సమస్యకు రెండు రోజుల్లో పరిష్కారం..
బాగ్‌లింగంపల్లిలోని శ్రీరాంనగర్లో వరద నీరు పోయేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌గారు సూచించారు. ఇందుకు గాను శ్రీరాంనగర్ నుంచి హుస్సేన్‌సాగర్ వదర కాలువలో కలిసేలా ప్రత్యేక నాలాను నిర్మించాలన్నారు. నేరుగా హుస్సేన్ సాగర్ వరద కాలువలో కలపకుండా.. కొంతదూరం కొనసాగించి నాలాను కలిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండు రోజుల్లో ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో ఉన్న నాలాను బంద్ చేసి.. అక్కడ ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది కబ్జా చేస్తున్నారని.. ఆ నాలాను పునరుద్ధరిస్తే వెంటనే సమస్య పరిష్కారం అవుతుందని స్థానికులు కమిషనర్‌కు తెలిపారు. శ్రీరాంనగర్‌లో వందలాది గృహాలకు దారి లేకుండా పోయిందని నడుం లోతు నీటిలో ఇళ్లకు ఎలా వెళ్లేదని స్థానికులు కమిషనర్ ముందు వాపోయారు. మోటార్లు పెట్టి తోడుతున్నా సమస్య పరిష్కారం కావడంలేదని.. ఇక్కడ ఉన్న ఖాళీ స్థలంలోంచి నాలాను తీసుకెళ్లి హుస్సేన్‌సాగర్ వరద కాలువలోకలిపాలని కోరారు.