అవినీతి అక్రమార్కులపై ధైర్యంగా సమాచారం ఇవ్వండి
* సింగరేణిలో అవినీతి దందాలపై ఉక్కు పాదం
* ఎంతటి వారైనా ఉపేక్షించే సమస్యే లేదు
* మోసగాళ్ల సమాచారాన్ని సింగరేణి విజిలెన్స్ ఏసీబీకి అందించండి
* సమాచారం ఇచ్చిన వారికి పూర్తి రక్షణ వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం
* ఆధారాలతో అక్రమార్కులను పట్టించిన వారికి రూ.10 వేల పారితోషకం
* సింగరేణి ఉద్యోగులకు యాజమాన్యం పిలుపు
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: శ్రమకు మారుపేరుగా నిలుస్తూ దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి సంస్థలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న కొన్ని అరాచక శక్తులను ఇప్పటికే ఏరివేయడం జరిగిందని ఇంకా ఇటువంటి అవినీతి దందాలు నడిపే వారికి సంబంధించిన వెనక ఉండి నడిపిస్తున్న వారి సమాచారం తెలియజేస్తే వారిని కూడా ఉక్కుపాదంతో అణిచివేస్తామని సింగరేణి యాజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. మెడికల్ బోర్డు ప్రక్రియలో అన్ ఫిట్ చేయిస్తామని బదిలీలు జరిపిస్తామని కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన వారిని వైద్య పరీక్షల్లో ఫిట్ చేయిస్తామని డిప్యూటేషన్లు ఇంటర్నల్ ఎక్స్ టర్నల్ పరీక్షల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సింగరేణి ఉద్యోగిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో సంస్థ ఈ ప్రకటన జారీ చేసింది. అమాయకులైన కార్మికులను వంచిస్తున్న ఎవరినైనా సరే సంస్థ ఉపేక్షించబోదని కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. అవినీతి చర్యలకు పాల్పడే వారిని వారికి వెనుక ఉండి సహకారం అందించే వారిని సైతం వదిలిపెట్టే ప్రసక్తే లేదని యాజమాన్యం హెచ్చరించింది. అవినీతికి బలైన బాధితులు లేదా దీనిపై సమాచారం ఉన్న ఏ ఇతర కార్మికులైన ఇతరులైన సరే సింగరేణి విజిలెన్స్ శాఖకు తెలియజేయవచ్చని ఫిర్యాదుదారుల పేర్లను గోప్యంగా ఉంచడమే కాక వారికి సంస్థ పూర్తి రక్షణ కల్పిస్తుందని యాజమాన్యం పేర్కొంది. అలాగే సింగరేణి సంస్థలో వివిధ పనులు చేయిస్తామని పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారి వివరాలు, ఆధారాలు ఇచ్చిన వారికి రూ.10 వేల పారితోషకం కూడా ఇవ్వనున్నట్లు పునరుద్ఘాటించింది. అదే సమయంలో సింగరేణి కార్మికులు తప్పుడు వ్యక్తుల సోపతి పట్టి వక్రమార్గాల్లో పయనించి ఉద్యోగ జీవితాన్ని పాడుచేసుకోవద్దని ప్రలోభ పెట్టే వారిని దగ్గరకు రానియొద్దని హితవు పలికింది. ఏరియాల్లో గనుల్లో డిపార్ట్ మెంట్ ల్లో సింగరేణి ఉద్యోగులు లేదా అధికారులు లేక బయట వ్యక్తులు ఎవరైనా సరే లంచాలు ఆశిస్తున్నట్లయితే వారి వివరాలను విజిలెన్స్ శాఖకు ఏసీబీకి అందించి పట్టించాలని యాజమాన్యం సూచించింది. అవినీతిని అక్రమాలను కూకటివేళ్లతో పెకిలించడానికి సదరు వ్యక్తులను కటకటాల వెనక్కి నెట్టడానికి సింగరేణి యాజమాన్యం సంసిద్ధంగా ఉందని సంస్థ పట్ల బాధ్యత గల కార్మికులు ఇందుకు సహకరించాలని సమాచారం అందించాలని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. అవినీతి అక్రమాలకు పాల్పడే వ్యక్తులు ఎవరైనా సరే, ఏ హోదాలో ఉన్న వదిలిపెట్టేది లేదని యాజమాన్యం స్పష్టం చేసింది.గతంలోనూ సింగరేణిలో అక్రమాలకు పాల్పడిన పలువురు ఉద్యోగులపై విచారణ జరిపి డిస్మిస్ చేసిన విషయాన్ని గుర్తుచేసింది. చట్టప్రకారం పలువురిపై చర్యలు కూడా తీసుకున్నట్లు వెల్లడించింది. ఇకముందు కూడా పారదర్శక సింగరేణి కోసం అక్రమార్కులపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేసింది. సింగరేణి సంస్థను అవినీతి రహిత కంపెనీగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు సహకరించాలని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. అవినీతిపరులపై ఫిర్యాదు చేసేందుకు కొత్తగూడెం విజిలెన్స్ శాఖ వారి ఫోన్ నెంబర్ 94911 44104 కు గాని విజిలెన్స్ శాఖ మెయిల్ ఐడి [email protected] కు సమాచారం ఇవ్వాలని యాజమాన్యం సూచించింది.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
