బీదవారికి ఇల్లు... ఆ కలను నిజం చేస్తున్నాం...
- జాబితాలో పేరు లేని వారు ఆందోళన పడవద్దు
- రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నమస్తే భారత్: పినపాక : రానున్న మూడు, నాలుగేళ్లలో రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి అన్నారు. బుధవారం పినపాక మండలం గొట్టెల గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తో కలిసి ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు చొప్పున నిర్మిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ సంక్షేమ పాలన చూసి ఓర్వలేకే తమపై విమర్శలు చేస్తున్నారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లుగా ఇళ్లు లేక పేద ప్రజలు ఎదుర్కోన్న ఇబ్బందులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఇందులో భాగంగా తొలి విడత 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.లబ్దిదారుల జాబితాలో పేర్లు లేని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అని, మలివిడతలో అధికారులు లబ్ధిదారులను గుర్తించి ఎంపిక చేస్తారని తెలిపారు.ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో బిల్లులు జమ చేస్తామని తెలిపారు. అర్హులు కాకపోయిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపిక చేయరాదని స్పష్టం చేశారు. ఎవరైనా అర్హుల జాబితాలో తప్పులు చేస్తే దానికి బాధ్యత వహించేది సంబంధిత అధికారి మాత్రమే అని మంత్రి హెచ్చరించారు.ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవారికి పార్టీతో సంబంధం లేకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అన్నారు. ప్రజలకు మంచి చేస్తే కూడా ఓర్వలేక ప్రతిపక్షాల నేతలు విమర్శిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు, డి సి సి బి డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య , మాజీ ఎమ్మెల్సీ బాల సాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం, కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు కోర్సా ఆనంద్, స్పెషల్ ఆఫీసర్ ఏడిఏ తాతారావు, డిఎల్పిఓ సుధీర్ కుమార్, తాసిల్దార్ అద్దంకి నరేష్, ఎంపీడీవో సునీల్ కుమార్, ఎంపీఓ వెంకటేశ్వరరావు, ఏపీఓ వీరభద్రస్వామి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతిథులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
