ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తేదీ, మే 07, 2025 -
నమస్తే భరత్
నిర్మల్:- జిల్లాలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని, పలు మండలాల్లో ఆక్రమణకు గురైన కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు నాలుగు మండలాల్లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని కబ్జా చేసిన ప్రభుత్వ భూములను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గత ఆరు నెలలుగా జిల్లాలోని వివిధ మండలాల్లో నిర్వహిస్తున్న ఆక్రమణల గుర్తింపు ప్రక్రియలో భాగంగా ఈ భూములు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. నిర్మల్ గ్రామీణ మండలంలో 35.03 ఎకరాలు (రూ.5.77 కోట్లు), భైంసా మండలంలో 18.31 ఎకరాలు (రూ.2.07 కోట్లు), నర్సాపూర్(జి) మండలంలో 16 ఎకరాలు (రూ.2.04 కోట్లు), లోకేశ్వరం మండలంలో 12.25 ఎకరాలు (రూ.1.34 కోట్లు) మొత్తం 82 ఎకరాలలు అన్యాక్రాంతం అయిన కోట్లాది విలువైన ప్రభుత్వ భూములను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని కలెక్టర్ తెలిపారు. ఆక్రమణదారులపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ప్రభుత్వ భూముల ఆక్రమణల గుర్తింపు ప్రక్రియ పలు మండలాలోని 260 ఎకరాలలో కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ రెవెన్యూ, అటవీ భూములు, చెరువు శిఖం భూములు, సాగునీటి ప్రాజెక్టుల కాలువలు తదితర భూములను అక్రమంగా ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలో ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగిస్తామని, ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

