జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు.
తేదీ, మే 07, 2025-
నమస్తే భరత్
నిర్మల్:-పట్టణంలోని బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మండలాల వారిగా నిరక్షరాస్యుల వివరాలను సేకరించి, వారందరికీ కనీస విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం బాసర మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో మహిళా సంఘాల సహాయంతో నిరక్షరాస్యులను గుర్తించి వారికి విద్య నేర్పేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ స్థాయిలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అంగన్వాడి కార్యకర్తలు, అలాగే మండల స్థాయిలో ఎంపీడీవో, ఎంఈవో, ఇతర అధికారులతో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందించాలన్నారు. విద్యా సేవకులుగా స్వచ్ఛందంగా పనిచేసేందుకు చదువుకున్న యువత, రిటైర్డ్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ముందుకు రావాలంటూ అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు. బడి మానేసిన వారిని గుర్తించి ఓపెన్ పాఠశాలల్లో చేర్చాలని, చదువురాని వారికి పెద్దల విద్య ద్వారా ధ్రువీకరణ పత్రాలు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఈవో పి. రామారావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి పరుశురాం, డిఆర్డిఓ విజయలక్ష్మి, అడల్ట్ ఎడ్యుకేషన్ అధికారి తిరుపతి రావు, మెప్మా పిడి సుభాష్, విద్యాశాఖ అధికారులు పరమేశ్వర్, లింబాద్రి, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

