ఆన్లైన్ బెట్టింగుల ఊబిలో చిక్కుకోవద్దు

* సులభంగా లోన్లు ఇస్తున్నారని ఆశపడి ఆన్లైన్ లోన్ యాప్ ల వలలో పడొద్దు
* జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచన
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: ఆన్లైన్ బెట్టింగుల పేరుతో అత్యాశకు పోయి ఊబిలో చిక్కుకోవద్దని సులభంగా లోన్లు ఇస్తున్నారని ఆశపడి ఆన్లైన్ లోన్ యాప్ ల వలలో పడవద్దని ఈజీ మనీకి అలవాటు పడి ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ లోన్ యాప్ ల వలలో చిక్కుకొని యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో యువతకు విజ్ఞప్తి చేశారు. సులభంగా డబ్బు వస్తుందని ఆన్లైన్ బెట్టింగులు గేములు పేకాట స్టాక్ మార్కెట్ ట్రేడింగులకు అలవాటు పడి సంపాదనంతా పోయి ఎంతోమంది అప్పుల పాలవుతున్నారని తెలిపారు. ఒకసారి కొంత మొత్తంలో డబ్బు రాగానే ఆన్లైన్ బెట్టింగ్ రమ్మి వంటి ఆటలు మంచి ఆదాయ మార్గమని యువత భావిస్తున్నారని అన్నారు. మొదట్లో కొద్దిపాటి లాభాలు రాగానే కూర్చున్న చోటే పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఎంతోమంది ఆన్లైన్ బెట్టింగులు గేములకు బానిసలుగా మారారని తెలిపారు. యువత మాత్రమే కాకుండా రిటైర్ అయిన ఉద్యోగులు పెద్దవాళ్లు కూడా ఆన్లైన్ జూదం గేమ్స్ బారినపడి అప్పుల ఊబిలో కూరుకుపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని తెలిపారు. ఆన్లైన్ గేములు ముందుగానే ప్రోగ్రామింగ్ చేసి ఉంటాయనే విషయాన్ని గ్రహించలేక అనేక మంది మోసపోయి తమ డబ్బులను పోగొట్టుకుంటున్నారని తెలిపారు.
లోన్ యాప్ లతో అప్రమత్తంగా ఉండాలి..మనకు అవసరం ఉన్నా లేకున్నా నిమిషాల్లోనే అప్పులు ఇస్తామంటూ వస్తున్న ఆన్లైన్ లోన్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. సులువుగా తమ ఖాతాలోకి సొమ్ము వస్తుందని లోన్ యాప్ ల నుండి అప్పులు చేసి ఆన్లైన్ బెట్టింగుల్లో జూదంలో పోగొట్టుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందని తెలిపారు. ఆన్లైన్ లోన్ యాప్ ల ద్వారా అప్పులు ఇచ్చే కంపెనీలు అప్పు తీసుకున్న వారి వ్యక్తిగత వివరాలన్నీ సేకరించి వారి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని తద్వారా అమాయకులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని అన్నారు. తల్లీదండ్రులు తమ పిల్లల దైనందిన కార్యకలాపాలను నిత్యం గమనిస్తూ ఉండాలని ఎస్పీ ఈ సందర్బంగా సూచించారు. బెట్టింగ్ యాప్ లలో లాభాలు వస్తాయన్నది భ్రమ అని గ్రహించాలన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లు వాడితే చట్ట ప్రకారం శిక్ష తప్పదని బాధితులపైనా కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలియజేసారు. ఎవరైనా ఆన్లైన్ ద్వారా గానీ నేరుగా గానీ బెట్టింగులకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కోరారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts

Latest News
