జీవో 9 ఉండగానే జీవో 46..
హైదరాబాద్, నవంబర్ 27( ) : బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో 9ని కాంగ్రెస్ ప్రభుత్వం తొలుత విడుదల చేసింది. ఆ వెంటనే షెడ్యూల్ విడుదల చేసింది. హైకోర్టు స్టే విధించడంతో ఆ జీవో అమలు అటకెక్కింది. జీవోపై విచారణ డిసెంబర్ 12న కొనసాగాల్సి ఉన్నది. అంతలోనే హడావుడిగా మొత్తం రిజర్వేషన్లను మళ్లీ 50శాతంలోపు కుదిస్తూ ప్రభుత్వం తాజాగా జీవో 46ని విడుదల చేసి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. కోర్టు తేల్చకముందే కొత్తగా జీవోను ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది? కోర్టు కొట్టేస్తుందని భావిస్తే ముందే ఎందుకు జీవో 9ని జారీ చేసింది? కేవలం బీసీలను వంచించేందుకేనని బీసీ సంఘాలు, రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నా రు. కోర్టుపై నెపం నెట్టేందుకు కాంగ్రెస్ యత్నిస్తుండడంపై నిప్పులు చెరుగుతున్నారు. బీసీ రిజర్వేషన్లపై లోక్‌సభలో విపక్షనేత రాహుల్ పూర్తిగా మౌనం వహించడం, పార్లమెంట్‌లోనూ ప్రశ్నించకపోవడం ఆ పార్టీ వంచనకు నిదర్శనమని చెప్తున్నారు. అడుగడుగునా కాంగ్రెస్ సర్కారు బీసీలకు తీరని ద్రోహాన్ని తలపెట్టిందని విమర్శలు గుప్పిస్తున్నారు.
