వైష్ణవి పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం
లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ నార్త్ మరియు మల్లారెడ్డి ఆసుపత్రి ఆధ్వర్యంలో
హైదరాబాద్ : జగద్గిరిగుట్టలోని వైష్ణవి టెక్నా పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ నార్త్ మరియు మల్లారెడ్డి ఆసుపత్రుల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ నార్త్ అధ్యక్షులు లయన్ బిర్రు ఆంజనేయులు, జోనల్ సభ్యులు లయన్ పాషాలు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనరల్, గుండె, కంటి, దంత, మహిళా విభాగాలలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులను అందజేశారు.
ఈ సందర్భంగా లయన్ బిర్రు ఆంజనేయులు మాట్లాడుతూ, సామాజిక సేవలో లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుంది అని తెలిపారు. వైష్ణవి పాఠశాల యాజమాన్యం శిబిరం ఏర్పాటులో ముందడుగు వేయడం అభినందనీయమని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, ఆసుపత్రుల వద్ద టిఫిన్ సరఫరా వంటి సేవా కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు.
కార్యక్రమంలో వైష్ణవి పాఠశాల చైర్మన్ సిహెచ్ నరసింహులు గౌడ్, డైరెక్టర్ జి. బాలరాజు, ప్రిన్సిపాల్ సాయిబాబా, లయన్స్ క్లబ్ ప్రతినిధి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
