డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలి ఆర్డీఓ రామచంద్రనాయక్
నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా : నారాయణపేట జిల్లాలో మాదకద్రవ్యాల నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేసి డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలని ఆర్డీఓ రామచంద్ర నాయక్ అన్నారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో మాదకద్రవ్యాల నిషేధం(యాంటీ నార్కోటిక్)పై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్డీఓ మాట్లాడారు. జిల్లాలో గంజాయి సాగు జరగకుండా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. జిల్లాలోని అన్ని జూనియర్, డిగ్రీ కళాశాలలో యాoటీ డ్రగ్ కమిటీల ద్వారా మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఉన్నత పాఠశాలలోనూ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. డి.ఎస్.పి నల్లపు లింగయ్య మాట్లాడుతూ.. జిల్లాలోని జూనియర్, డిగ్రీ కళాశాలలో యాoటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలోని అన్ని ప్రాంతాలలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిషేధం పై విద్యార్థులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. గతంతో పోలిస్తే డ్రగ్స్ కేసులు చాలా తక్కువ అయ్యాయని ఆయన తెలిపారు. టాస్స్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు డ్రగ్స్ పై క్షేత్రస్థాయిలో నిఘా పెట్టడం జరిగిందని డిఎస్పీ వివరించారు. కేవలం పోలీసు శాఖ మాత్రమే కాకుండా ఆబ్కారీ శాఖ అధికారులు కూడా మాదకద్రవ్యాల నిషేధంపై కార్యక్రమాలు నిర్వహించాలని ఆర్డీఓ సూచించారు. అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా ఇంటర్ ఎడ్యుకేషన్ అధికారి నేతత్వంలోనూ ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. గతంలో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించామని, ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ఉన్నాయని, జూన్ లో మళ్ళీ నిర్వహిస్తామని డిఐఈఓ సుదర్శన్ తెలిపారు. జిల్లా వైద్యశాఖ అధికారులు సైతం ఏఎన్ఎం, ఆశా కార్యకర్తల నెలవారి సమావేశాలలో డ్రగ్స్ నిషేధం గురించి తెలిపి క్షేత్రస్థాయిలో వారి ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇక ముందు జరిగే యాంటి నార్కోటిక్ సమావేశాలకు ఆయా శాఖల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిషేధంపై నిర్వహించిన కార్యక్రమాల నివేదికను తయారుచేసి తీసుకురావాలని ఆర్డీఓ ఆదేశించారు. మాదకద్రవ్యాలను జిల్లాలో పూర్తిగా నిషేధించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఈ సందర్భంగా ఆర్డీఓ కోరారు. టీజీ యాంటీ నార్కోటిక్ బ్యూరో డి.ఎస్.పి బుచ్చయ్య మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిషేధానికి సంబంధించిన శాఖల జిల్లా స్థాయి అధికారులతో యాంటి నార్కోటిక్ నారాయణపేట పేరిట ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి ప్రతి నెల జరిగే యాంటి నార్కోటిక్ మీటింగ్ లలో నమోదు చేసిన మినిట్స్ ను ఇన్ టైంలో అప్ లోడ్ చేయాలని కోరారు. సమావేశాల్లో చర్చించిన అంశాలు, డ్రగ్స్ నిషేధానికి శాఖల వారీగా తీసుకున్న చర్యలను గ్రూప్ లో షేర్ చేయాలని సూచించారు. ఏమైనా మత్తు పదార్థాలు దొరికితే అవి ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయనే కోణంలో విచారణ చేయాలని చెప్పారు. కల్తీ కల్లుకు వినియోగించే ఆల్ఫోజోలం జిల్లాలో ఎక్కడైనా సరఫరా అవుతుందా అని నిఘా పెట్టాలన్నారు. కల్లు కాంపౌండ్లను కూడా తనిఖీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో మేఘా గాంధీ, డ్రగ్ ఇన్స్ స్పెక్టర్ వినయ్ కుమార్, ఎక్సైజ్ సీఐలు పురుషోత్తం రెడ్డి, గురువయ్య, వైద్య ఆరోగ్యశాఖ అధికారి భిక్షపతి, సి సెక్షన్ అధికారిని పాల్గొన్నారు. చివరగా టీ జీ యాంటి నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో డ్రగ్స్ నిషేధం పై అవగాహన కల్పించేందుకు ముద్రించిన వాల్ పోస్టర్లను అధికారులు ఆవిష్కరించారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
