బీజేపీ కార్మిక,రైతు,ప్రజా వ్యతిరేక విధానాలపై జులై 9 న జరుగుతున్న జాతీయ సమ్మెకు సంపూర్ణ మద్దతు
తెలంగాణ గిరిజన సంఘం(టీజీఎస్)
నమస్తే భారత్ :-మహబూబాబాద్
కేంద్రంలో బిజెపి అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక,రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జులై 9 న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు తెలంగాణ గిరిజన సంఘం మహబూబాబాద్ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్థూ గిరిజన హక్కులను కాపాడుకుందాం అనే డిమాండ్ తో గిరిజనులు పాల్గొనాలని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భానోత్ వెంకన్న నాయక్, భూక్య హరినాయక్ లు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు రాజ్యాంగంలో గిరిజనులకు కల్పించిన హక్కులు, చట్టాలను కాలరాస్తోందని ఆరోపించారు. లేబర్ కోడ్ ల పేరుతో కార్మిక హక్కులను సమాధి చేస్తూ మరోవైపు దేశ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా నూతన రైతు చట్టాలను ప్రవేశ పెడుతూ అంబానీ ఆదానీ లాంటి బడా కార్పొరేట్ సంస్థలకు మేలు చేకూరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని 12 గంటల పని విధానంగా చట్టాల్లో మార్పులు చేస్తోందని విమర్శించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 12 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని నూతన పాలసీని రూపొందించిందని అన్నారు. బిజెపి,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కార్మికులు,శ్రామికులను బానిసలుగా మార్చే విధంగా కుట్రలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాదిమంది గిరిజనులు, దళితులు, బలహీనవర్గాలు, పేదలు ఆధారపడి జీవిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలనే కుట్రతో 2025 బడ్జెట్లో గతంలో ఎన్నడు లేని విధంగా కోత పెట్టిందని విమర్శించారు. తరతరాలుగా అటవీ, పోడు భూముల పై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీ గిరిజనులను అడవుల నుండి బలవంతంగా గెంటి వేసే విధంగా అటవీ సంరక్షణ నియమాల చట్టం 2023 పేరుతో తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో జీవో నెంబర్ 49 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వేలాది మంది ఆదివాసి గిరిజనులను అడవుల నుండి బలవంతంగా గెంటివేసేందుకు పూనుకుందని అన్నారు. భారత రాజ్యాంగంలో ఆదివాసి గిరిజనులకు ఉన్న హక్కులతో పాటు 5, 6 వ షెడ్యూల్ ప్రాంత హక్కులు, చట్టాలపై దాడిని తీవ్రతరం చేసిందని అన్నారు. శతాబ్దాలుగా ఆదివాసీ గిరిజనులు ఆచరిస్తూ వస్తున్న సంస్కృతి, ఆహార అలవాట్లు, ఆచారాలపై మూక దాడులు చేస్తూ బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు హత్యలకు పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగాన్ని రద్దుచేసి మనుస్మృతిని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతోనే ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసభలే సోషలిస్టు,సెక్యులరిజం అనే మౌలిక సూత్రాలను రాజ్యాంగం నుండి తొలగించాలనే వ్యాఖ్యలు చేశారన్నారు. గత పది సంవత్సరాలు కాలంలో కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను క్రమంగా నిర్వీర్యం చేసి రద్దు చేయాలనే కుట్రలో భాగంగానే ప్రభుత్వ రంగంలోని సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందని అన్నారు. ఆదివాసి గిరిజన సంస్కృతి పై మనువాద సంస్కృతిని బలవంతంగా రుద్ది హైందవీకరించేందుకు పూనుకుందన్నారు.
ఇటువంటి నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక,రైతు,ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక రైతు ప్రజా సంఘాలు జులై 9 న చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా గ్రామాలు,మండలాలు, పట్టణాలు,జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రదర్శనలో గిరిజన హక్కుల సాధన కోసం గిరిజనులు, గిరిజన సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Related Posts
