క్షణం క్షణం జననం... తరం తరం అంతరం... (జులై 11, ప్రపంచ జనాభా దినోత్సవం ):

క్షణం క్షణం జననం... తరం తరం అంతరం... (జులై 11, ప్రపంచ జనాభా దినోత్సవం ):

1ee6134a-ec64-4c04-93ac-050ce0b117be1f7547e6-bebc-4467-af17-989b283055b2ffe3f13f-564a-4139-b13b-54753c383a0e
  ఆందోళన కలిగించే సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి, సమస్యలను పరిష్కరించడానికి లేదా వనరులను పెంచడానికి, మరియు బలోపేతం చేయడానికి ప్రపంచ దినోత్సవాలు జరుపుకుంటాం.
ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న జనాభా, తద్వారా తలెత్తే దుష్పరిణామాలను వివరించేందుకు, సమస్యలపై ప్రజలలో చైతన్యం కలిగించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని 1989లో ప్రారంభించింది. కుటుంబ నియంత్రణ యొక్క ప్రాముఖ్యత, లింగ సమానత్వం, పేదరికం, తల్లి ఆరోగ్యం మరియు మానవ హక్కులు వంటి వివిధ జనాభా సమస్యలపై ప్రజలకు అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. 1987 జులై 11 నాటికి ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకోవడంతో ఆరోజునే ప్రపంచ జనాభా దినంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇక అప్పటి నుంచి క్రమం తప్పకుండా జూలై 11న ప్రతి ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 2025 థీమ్ “మాతాశిశు శ్రేయస్సు కోసం ఆరోగ్యకరమైన సమయం మరియు ఎడం(అంతరం) కలిగిన గర్భధారణ “ .  
ప్రపంచ జనాభా పోకడలు: 1987 జులై 11 నుంచి సరిగ్గా 20 ఏళ్ల తరువాత అంటే జులై 11, 2007 నాటికి ప్రపంచ జనాభా 6,602,226,175కు చేరుకున్నట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. 2008 జూన్ 28 నాటికి 6.7 బిలియన్లు ఉండగా, 2012 నాటికి ఏడు బిలియన్లకు చేరుకుంది.ఇది 2021లో దాదాపు 7.9 బిలియన్లకు చేరుకుంది. 2050లో ప్రపంచ జనాభా 9.7 బిలియన్లకు చేరే అవకాశముందని కూడా పేర్కొంది. 1,428.6 మిలియన్ల జనభాతో మొదటి స్థానంలో భారత్, 1,425.7 మిలియన్ల జనాభాతో చైనా రెండో స్థానంలో ఉండగా, 340 మిలియన్ల జనాభాతో అమెరికా మూడో స్థానంలో ఉంది. అయితే 2023 నాటికి మొదటి స్థానంలో ఉన్న చైనాను భారత్‌ అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశంగా అవతరించింది. ప్రస్తుతం ఈ రెండు దేశాలు ప్రపంచ జనాభాలో 37 శాతం ఆక్రమించాయి. ఇటీవలి కాలంలో సంతానోత్పత్తి రేట్లు మరియు జీవన కాలపు అంచనాలలో అపారమైన మార్పులు వచ్చాయి. 1970 ప్రారంభంలో, స్త్రీలు సగటున ఒక్కొక్కరు 4.5 మంది పిల్లలను కలిగి ఉన్నారు. 2015 నాటికి, ప్రపంచంలోని మొత్తం సంతానోత్పత్తిలో ప్రతి స్త్రీకి 2.5 కంటే తక్కువకు పడిపోయింది. ఇంతలో, ప్రపంచ సగటు మనిషి జీవితకాలం 1990ల ప్రారంభంలో 64.6 సంవత్సరాల నుండి 2019లో 72.6 సంవత్సరాలకు పెరిగింది. అదనంగా, ప్రపంచం అధిక స్థాయి పట్టణీకరణను కోరుకుంటుంది మరియు వలసలను వేగవంతం చేస్తోంది. అవి ఆర్థికాభివృద్ధి, ఉపాధి, ఆదాయ పంపిణీ, పేదరికం మరియు సామాజిక రక్షణలను ప్రభావితం చేస్తాయి. ఆరోగ్య సంరక్షణ, విద్య, గృహాలు, పారిశుద్ధ్యం, నీరు, ఆహారం మరియు శక్తికి సహకరించే  ప్రయత్నాలను కూడా ఇవి ప్రభావితం చేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు లైంగిక మరియు పునరుత్పత్తి ఆరోగ్యంపై నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారు.
కుటుంబ ఆరోగ్యం: నేడు విద్య, శాస్త్రీయ విజ్ఞానం అభివృద్ధి చెందడం వల్ల, యువ దంపతులు తమకు ఎప్పుడు సంతానం కావాలి, ఎంతమంది కావాలి అని నిర్ణయించుకుని తమ కుటుంబం సుఖసంతోషాలతో, కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవడం జరుగుతోంది. దంపతులు తాము కోరుకున్నప్పుడే, కోరుకున్నంత మంది పిల్లలను కనగలిగే వసతులు ఇప్పుడు ఉన్నాయి. తమ బిడ్డలకు చక్కని విద్యను అందించడం, ఆరోగ్యవంతమైన పరిసరాల్లో పెరిగే అవకాశం కల్పించడం తప్పనిసరి అని భావిస్తున్న తల్లిదండ్రులు, దానికి తగ్గట్లుగా తమ ఆర్థిక స్థితి ఉండేలా చూసుకుంటున్నారు. ఎక్కువ మంది పిల్లలు పుట్టినట్లయితే, వారి అవసరాలను తీర్చటం తమకు కష్టమని వారు గుర్తిస్తున్నారు. అందుకే తక్కువ సంతానం తోనే చిన్న కుటుంబంగా పరిమితం చేసుకుంటున్నారు. అప్పుడే పిల్లలు వద్దనుకున్నా, బిడ్డల మధ్య ఎడం కావాలనుకున్నా, వాడటానికి స్త్రీ, పురుషులకు గర్భనిరోధక సాధనాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరికి అనువైనవి వారు ఎంచుకునే అవకాశం ఉంది. అలాగే పిల్లలు ఇక చాలు అనుకున్నాక కుటుంబ నియంత్రణ  ఆపరేషన్ సౌకర్యం ఉంది. ఈ పద్ధతులు నమ్మకమైనవి, సులువైనవి, సురక్షితమైనవి. చిన్న కుటుంబం కాబట్టి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి.
కాన్పు కాన్పుకు మధ్య ఎడం ఎందుకు?: కొందరికి చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు జరుగుతాయి. ఇలాంటప్పుడు తల్లీబిడ్డల ఆరోగ్యం దృష్ట్యా మొదటి సంతానాన్ని వాయిదా వేయడం మంచిది. అలాగే ఒక బిడ్డ కలిగిన దంపతులు కూడా కాన్పుల మధ్య 3 సంవత్సరాల ఎడం వుండేటట్లు చూసుకోవాలి. దీనికి శాస్త్రీయమైన కారణాలు అనేకం ఉన్నాయి. కాన్సు సమయంలో స్త్రీలు ఎంతో రక్తాన్ని కోల్పోతారు. వారు తిరిగి సాధారణ ఆరోగ్యస్థితికి చేరుకోవడానికి కనీసం మూడు ఏళ్లు పడుతుంది. ఒక బిడ్డ వెంటనే మరో బిడ్డకు జన్మనిస్తే స్త్రీకి పోషకాహార లోపమే కాక పుట్టే బిడ్డ బరువు తక్కువగా పుట్టచ్చు, ఆ స్థితిలో మొదటి బిడ్డను సరిగా చూసుకోవడం కష్టం. కాన్పుల మధ్య వ్యవధి లేకపోవడం తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాక శిశు మరణాలకు కూడా కారణం అవుతుంది.
తాత్కాలిక కుటుంబ నియంత్రణ సేవలు: కాన్పుల మధ్య ఎడం పాటించడానికి సులువైన సురక్షితమయిన గర్భనిరోధక పద్ధతులు ఆడవారికి, మగవారికి వేరు వేరుగా ఉన్నాయి. ఎవరికి అనువైన పద్ధతిని వారు ఎంచుకునే అవకాశం కూడా ఉంది. కాన్పుల మధ్య ఎడానికి వాడే తాత్కాలిక కుటుంబ నియంత్రణ సాధనాలలో ముఖ్యమైనవి మగవారికి నిరోధ్, ఆడవారికి నోటి మాత్రలు, కాపర్ టీ, అంతర ఇంజక్షన్. అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో, ఉపకేంద్రాలలో ఈసేవలు ఉచితంగా లభిస్తాయి. 
నిరోధ్: సంభోగ సమయంలో గర్భనిరోధానికై పురుషుడు ఉపయోగించే సాధనం నిరోధ్. ఇది పలచటి రబ్బరుతో తయారు చేయబడింది. దీన్ని పురుషుడు తన జననాంగానికి తొడుగులా అమర్చుకోవలసి ఉంటుంది.
నిరోధ్ వాడటం వల్ల లాభాలు అనేకం. దీన్ని ఉపయోగించడం సులభం. అన్ని విధాలా ఇది సురక్షితమైనది. దీన్ని వాడేందుకు డాక్టరు పరీక్ష సంహాలు అవసరం లేదు. స్త్రీ పురుషులలో సుఖవ్యాధులు ఒకరి నుండి ఒకరికి సంక్రమించకుండా కూడా ఇది అరికడుతుంది. కానీ మన దేశంలో 3% మాత్రమే వాడుతున్నారు. నిరోధ్ ని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రతీ సంభోగానికి కొత్త నిరోధ్ మాత్రమే వాడాలి. ఉపయోగించిన నిరోధ్ ని ముడివేసి, పేపర్లో చుట్టి, చెత్తబుట్టలో వేయాలి. నిరోధ్ ప్యాకెట్లు పిల్లలకు అందుబాటులో లేకుండా చూసుకోవాలి.
గర్భ నిరోధక నోటి మాత్రలు: గర్భ నిరోధానికై స్త్రీలు వాడగల రెండు రకాల సాధనాలలో ఒకటి గర్భ నిరోధక నోటి మాత్రలు, రెండవది కాపర్ టి. గర్భనిరోధక నోటి మాత్రలను ఋతుస్రావం ప్రారంభమైన 5వ రోజు నుండి రోజు ప్రతి రాత్రి వరుసగా వేసుకోవాలి. ఏ మాత్ర నుండి మొదలు పెట్టాలో ప్యాకెట్ వెనుక గుర్తించబడి ఉంటుంది. ఒక ప్యాకెట్ లో 28 టాబ్లెట్స్ ఉంటాయి. 21 మాత్రలు తెలుపు రంగులోను, 7 మాత్రలు నలుపు లేదా ఎరుపు రంగులో ఉంటాయి. తెల్లరంగులో ఉన్నవి హార్మోన్ మాత్రలు. వేరే రంగులో ఉన్నవి ఐరన్ మాత్రలు. ఒక ప్యాకెట్ అయిపోయిన వెంటనే తిరిగి రెండవ ప్యాకెట్ ప్రారంభించాలి. ఏ రోజైనా మాత్ర వేసుకోవడం మరిచిపోతే మరుసటి రోజున ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకోవాలి. మొదటిసారిగా ఈ మాత్రలు వాడేముందు డాక్టరును సంప్రదించాలి. ఈ మాత్రలు గ్రామాలలో ఉండే ఆరోగ్య ఉప కేంద్రాలలో ఏ.ఎన్.ఎం.లవద్ద లేదా ఆషా కార్యకర్తల వద్ద ఉచితంగా పొందవచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు, పాలిచ్చే తల్లులు ఆరునెలల వరకు, గుండె జబ్బు, మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు, ఉబ్బస వ్యాధి, కాలేయపు వ్యాధులున్నవారు, గర్భ సంచికి, సర్విక్స్ కి క్యాన్సర్ ఉన్నవారు, గత ఆరు నెలలలోపు పచ్చకామెర్లు వచ్చినవారు ఈ మాత్రలు వాడరాదు.
కాపర్- టీ: ఇంగ్లీష్ అక్షరం టీ ఆకారంలో ఉండే సాధనం ఇది. పాలిథిన్ తో తయారైన ఈ సాధనాన్ని కుటుంబ నియంత్రణ కోరుకునే స్త్రీ గర్భసంచీలో అమరుస్తారు. ఈ పరికరంలోని నిలువు భాగం చుట్టూ పరిశుభ్రంగా ఉండే సన్నని రాగితీగ అమర్చబడి ఉంటుంది. ఇద్దరు బిడ్డల మధ్య 3 ఏళ్ళ కనీస వ్యవధి ఉండేలా చూసుకోవడానికి కాపర్- టీ చాలా అనువైన సాధనం. ప్రసవానికి ఆరు వారాల తరువాత గానీ, బహిష్టు అయిన వారం రోజుల లోపు గానీ ఈ సాధనాన్ని స్త్రీ గర్భసంచీలో అమర్చవచ్చు. ఒకసారి అమరిస్తే 3 నుంచి 10 సం.ల వరకు దీన్ని గర్భసంచీ లోనే ఉంచొచ్చు. 3 యేళ్ళ తర్వాత పిల్లలు ఒకవేళ కావాలనుకుంటే దీన్ని తీయించేసుకుంటే చాలు. 'కాపర్ టి' ఎంతో' నమ్మకమైన, సురక్షితమైన పద్దతి అయినప్పటికి గ్రామాలలో వీటిపై అపోహలు, అనుమానాలతో స్త్రీలు ముందుకు రాక, వెంట వెంటనే గర్భం ధరించడం జరుగుతుంది. అభివృద్ధి చెందిన దేశాలలో మహిళలు గర్భ నిరోధక సాధానాలను సమర్ధవంతంగా ఉపయోగిస్తూ, ఒక ప్రణాళిక ప్రకారం తాము కావాలనుకున్నప్పుడే సంతానాన్ని పొందగలుగుతున్నారు. మనదేశంలో ఈ సాధనాల గురించి తెలుసుకొని  వాడుతున్న వారి సంఖ్య 3% మాత్రమే. పిల్లల్ని కనే వయస్సులో ఉన్న దంపతులందరూ ఈ సాధనాల గురించి పూర్తి సమాచారం తెలుసుకుని, తగిన పద్ధతిని ఎంచుకుని 100 శాతం ఆచరణలో పెట్టాలి.
అంతర ఇంజక్షన్: కొత్తగా పెళ్ళైన మహిళలకు, పిల్లల మధ్య ఎడం కావాలనుకునే మహిళల గర్భనిరోధానికి యిచ్చే ఇంజక్షన్ అంతర. మూడు నెలలకోసారి ఇస్తారు. ఈ ఇంజక్షన్ ఆపివేసిన మూడు నెలలకు తిరిగి గర్భం దాల్చవచ్చు.
శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులు: కుటుంబంలో భార్యా భర్తలు తమకు ఎంతమంది సంతానం కావాలో నిర్ణయించుకుని ఇద్దరిలో ఎవరైనా ఒకరు శాశ్వత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవచ్చు. మగవారికి 'వేసెక్టమి లేదా కోత కుట్టు లేని వేసెక్టమి. ఆడవారికి 'ట్యూబెక్టమి లేదా డబుల్ పంచ్ లాపరో స్కోపిక్ ట్యూబెక్టమి 'అని రెండు రకాల శస్త్ర చికిత్సలు ఉన్నాయి. నిజానికి ఆడవారి కంటే మగవారికి చేసే ఆపరేషన్ చాలా తేలిక.
ట్యూబెక్టమి(సాంప్రదాయకరమైన పద్ధతి) : శాశ్వత పద్ధతిలో కుటుంబ నియంత్రణను కోరుకునే స్త్రీ, ట్యూబెక్టమి పద్ధతిని ఎంచుకోవచ్చు. ఈ ఆపరేషన్ శాశ్వతమైనది, సురక్షితమైనది, నమ్మకమైనది. ఆపరేషన్ బహు సులభం. ఈ పద్ధతిలో పొత్తి కడుపు మీద చిన్న కోత ఇచ్చి, అండనాళముల లోని కొంత భాగాన్ని కత్తిరించి తీసివేసి, వాటి కొనలను వేరు వేరుగా ముడి వేస్తారు. తరువాత చర్మంపై రెండు గాని మూడు గాని కుట్లు వేస్తారు. శస్త్రచికిత్స తరువాత వారం రోజులు ఆస్పత్రిలో ఉండవలసి వస్తుంది. అటు తరువాత కొద్ది రోజులు విశ్రాంతి అవసరం.                                                                       
డబల్ పంచ్ లాపరోస్కోపిక్ ట్యూబెక్టమీ (డి.పి.యల్.): ప్రసవించిన 6 వారాల తరువాత గానీ, బహిష్టు అయిన తరువాత గానీ, సాధనాన్ని రెండు చిన్న రంద్రాల ద్వారా పొత్తి కడుపులో ప్రవేశపెట్టి శస్త్ర చికిత్స చేస్తారు. నాలుగు గంటల లోపల మామూలు ఆహారం తీసుకోవచ్చు.
వేసెక్టమి (సాంప్రదాయక పద్ధతి): ఇది పురుషులకు చేసే సంతాన నిరోధక శాశ్వత పద్ధతి. ఈ ఆపరేషన్ చేసిన తరువాత వీర్యంలో గర్భధారణకు అవసరమైన బీజ కణాలు మాత్రం ఉండవు. కేవలం 10 నిమిషాలలో పూర్తికాగల ఈ శస్త్ర చికిత్స అయిన అర్ధగంట తరువాత ఇంటికి వెళ్లవచ్చు. సాంప్రదాయ శస్త్ర చికిత్స అయిన తరువాతి 3 నెలల వరకు లేక 20 వీర్య స్కలనముల వరకు నిరోధ్ వాడి తీరాలి. ఇద్దరు పిల్లలు లేదా ఇంక పిల్లలు వద్దనుకున్న ఏ పురుషుడైనా వేసక్టమి ఆపరేషన్ కి అర్హుడే. వేసెక్టమి ఆపరేషన్ సురక్షితమైన, సులభమైన, నమ్మకమైనది. ఆసుపత్రిలో ఉండవలసిన అవసరం లేదు. ఆపరేషన్ చేయించుకున్న వెంటనే ఇంటికి వెళ్లిపోవచ్చు. రెండవ రోజు నుంచి పనులు యధావిధిగా చేసుకోవచ్చు.
కోత, కుట్టులేని వేసెక్టమీ ( ఎన్.యస్.వి.): ఈ శస్త్ర చికిత్స చేయడానికి కోతగానీ, కుట్టు కానీ వేయవలసిన అవసరము లేదు. ప్రత్యేక శిక్షణ పొందిన వైద్యులు ఈ శస్త్ర చికిత్స చేస్తారు. శస్త్ర చికిత్స అయిన అర్ధగంట తరువాత ఇంటికి వెళ్లవచ్చును. సాంప్రదాయ వేసక్టమిలో లాగే శస్త్ర చికిత్స అయిన తరువాత 3 నెలల వరకు లేక 20 వీర్య స్కలనముల వరకు నిరోధ్ వాడి తీరాలి. సాంప్రదాయమైన వేసెక్టమీ, ట్యూబెక్టమీ శస్త్ర చికిత్సలు అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో జరుగుతున్నాయి. కాని ఇతర పద్ధతి శస్త్ర చికిత్సలు (డీపీఎల్. లేదా ఎన్.యస్.వి. ) నేర్పరులైన, అనుభవజ్ఞులైన వైద్యులు అన్ని సదుపాయాలు గల ఏరియా/జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో నిర్వహిస్తున్నారు.
రీకేనలైజేషన్ : పుట్టిన బిడ్డలు జీవించి ఉంటారో ఉండరోనన్న భయంతో కొందరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి సందేహిస్తుంటారు. నిజానికి ఇలాంటి భయాలు అనవసరం. కుటుంబ నియంత్రణ చేయించుకున్న తరువాత కూడా ఏ కారణం చేతనైనా మళ్ళీ పిల్లలు కావాలనుకొంటే, తిరిగి ఆపరేషన్ (రీకేనలైజేషన్) చేయించుకొని, బిడ్డలను కనగల అవకాశం ఉంది.                                                                                                                                                                                                 -నాశబోయిన నరసింహ (నాన), కవి,రచయిత, ఆరోగ్యవిస్తరణ అధికారి, 8555010108

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో యువకుడు ఆత్మహత్యా యత్నం.. కేసు నమోదు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో యువకుడు ఆత్మహత్యా యత్నం.. కేసు నమోదు
వినాయక్ నగర్ : నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ఆ వరణలో బాలాజీ అనే యువకుడు ఒంటిపై డిజిల్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. నగరంలోని...
బ్రిడ్జి కూలిన ఘటనలో 15కు పెరిగిన మృతుల సంఖ్య.. గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
కిష్టారెడ్డిపేటలో స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు..
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని.. తల్లితో కలిసి తండ్రిని చంపిన కూతురు
మొన్న 90 డిగ్రీలు, పాములా మెలికలు తిరిగిన బ్రిడ్జ్‌.
ఇజ్రాయెల్‌ దాడుల్లో 40 మంది పాలస్తీనియన్లు మృతి
వెదజల్లే పద్దతితో అధిక దిగుబడి