కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి
పథకాల అమలులో పారదర్శకత అవసరం
ఎంపీ గోడం నగేష్
కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామీణ ప్రజలకు సమర్థవంతంగా అందించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలనీ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ అన్నారు.
తేదీ, జులై 09, 2025-
నమస్తే భరత్
బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (దిశా) సమావేశానికి ఎంపీ అధ్యక్షత వహించారు.
ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ధికి, పేద ప్రజల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, అవి పూర్తిస్థాయిలో పారదర్శకంగా అమలు చేయాలనీ స్పష్టం చేశారు. ఆర్టికల్ 275(1), CCDP (కంప్రహెన్సివ్ కన్జర్వేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్), MPC (మిషన్ ఫర్ ప్రొటీన్ చెయిన్) వంటి పథకాల కింద జిల్లాకు వచ్చిన నిధులను సద్వినియోగం చేయాలని ఆదేశించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు జారీ చేయాలన్నారు. ప్రతి కూలికి వంద రోజుల పనిదినాలు కల్పించాలని అన్నారు. ఉపాధి హామీ పథకానికి అనుసంధానంగా జిల్లాలో చేపట్టిన రోడ్లు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, డ్రైనేజీ కాలువల నిర్మాణాలు, అనుమతులు లభించిన వెంటనే పనులు ప్రారంభించాలనీ, నిధులను సమర్థవంతంగా వినియోగించి పనులు వేగంగా పూర్తిచేయాలనీ స్పష్టం చేశారు. అన్ని ఇంజినీరింగ్ శాఖలు, ఇతర సంబంధిత శాఖలతో సమన్వయంతో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అధికారులంతా ప్రతి పనిని స్వయంగా తనిఖీ చేసి, పనులన్నింటినీ పారదర్శకంగా, నాణ్యతతో పూర్తిచేయాలని, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రణాళికాబద్ధంగా, సమగ్రంగా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి అమృత్ 2.0, పీఎం కిసాన్ సమ్మాన్ యోజన, పీఎం శ్రీ పథకాలకు గుణాత్మకంగా అమలు చేయాలన్నారు. పట్టణ ప్రాంతాలకు త్రాగునీటి సరఫరా కోసం చేపట్టిన నీటి ట్యాంకుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన (PM-KISAN) పథకానికి జిల్లాలో అర్హత కలిగిన రైతులందరికీ తప్పనిసరిగా నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని, పథకానికి అర్హత కలిగిన ప్రతి రైతుకు లబ్ధి అందేలా వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. అలాగే రైతులకు అవసరమైన ఎరువులు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరువుల కొరత తలెత్తకూడదని, వ్యవసాయ శాఖ సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యాశాఖలో పీఎం శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌లు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని, విద్యారంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే అన్ని రకాల రుణాలు అర్హులైన ప్రతి ఒక్కరికి సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, విద్య, వైద్య, గిరిజన, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ, మున్సిపల్, సంక్షేమ తదితర శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, అలాగే ప్రస్తుతం అమలులో ఉన్న ప్రభుత్వ పథకాల పురోగతిపై శాఖల వారీగా పథకాలు ఎలా అమలవుతున్నాయో సమీక్షించి, అధికారులకు ఎంపీ అవసరమైన సూచనలు చేశారు.
పలువురు శాసనసభ్యులు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు ప్రజల వరకు సమర్ధవంతంగా చేరేందుకు అమలు బాధ్యత అధికారులపై ఉన్నదని స్పష్టం చేశారు. అన్ని పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా అమలయ్యేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు
అనంతరం జిల్లా అభిలాష అభినవ్ మాట్లాడుతూ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద అర్హులైన ప్రతి ఒక్కరికి వంద రోజుల పని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో మొత్తం 926 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, ఇందులో 201 కేంద్రాలు ప్రభుత్వ భవనాల్లో, 367 ప్రైవేట్ భవనాల్లో, 358 పాఠశాల భవనాల్లో అనుబంధంగా నిర్వహించబడుతున్నాయని తెలిపారు. నూతనంగా 36 అంగన్వాడీ భవనాలు (ప్రతి మండలానికి 2 చొప్పున) నిర్మాణానికి అనుమతులు లభించాయని, ఇప్పటివరకు 20 భవన నిర్మాణాలు పూర్తీ అయినాయని, మిగితా పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. మెప్మా ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లో 600 మహిళా సంఘాలకు రూ.58 కోట్ల రుణాలు అందించామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 130 గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, వాటిలో 36 భవనాలకు అనుమతులు మంజూరు అయినాయని తెలిపారు. ఇప్పటివరకు 10 భవనాల నిర్మాణం పూర్తయినట్లు చెప్పారు. ఈ భవనాల నిర్మాణానికి 1 కోటి 13 లక్షల నిధులను ఖర్చుచేయడం జరిగిందని వివరించారు. అలాగే జిల్లాలో రూ.47 కోట్ల వ్యయంతో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. అమృత్ 2.0 పథకం కింద 3 నీటి ట్యాంకుల నిర్మాణానికి అనుమతులు లభించాయని తెలిపారు. పీఎం శ్రీ పాఠశాలల్లో బోధన నైపుణ్యాలు మెరుగుపరచడం కోసం 11 పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌లు, 29 పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి అనుమతులు లభించినట్లు తెలిపారు. అభివృద్ధిని కార్యక్రమాలను మరింత వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెల్లడించారు.
ఈ సమావేశంలో శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి (నిర్మల్), పవార్ రామారావు పటేల్ (ముధోల్), వెడ్మా బొజ్జు పటేల్ (ఖానాపూర్), అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీవోలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

