ప్రభుత్వ జాగా..ఓ లక్షాధికారి కబ్జా..!

* పోడూరు మండలం కవిటంలో రూ.లక్షల విలువైన స్థలం పరాధీనం
* అంచెంచెలుగా ఆక్రమణ గురైన వైనం
* రేకుల షెడ్డు.. దుకాణాలుగా నిర్మాణం
* అధికార యంత్రాంగం.. కన్నెత్తి చూడని వైనం
నమస్తే భారత్, పోడూరు, అక్టోబర్ - 11 : ప్రభుత్వ భూమిపై లక్షాధికారి కన్ను పడింది. దీంతో లక్షలు విలువ చేసే ప్రభుత్వ స్థలం ఆక్రమణదారుని హస్తగతం అయింది. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కవిటంలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 6 సెంట్లకు పైబడి ప్రభుత్వ స్థలం అదే గ్రామానికి చెందిన తోట సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి పరాధీనమైంది. ఏడాది క్రితం నుంచి ఆక్రమణ అంచెంచెల దశలో అక్రమ కట్టడాలకు తెర తీశారు. తొలుత రెండు దుకాణాలకు సంబంధించి రేకుల షెడ్డు నిర్మించినా ప్రభుత్వ అధికారుల నుంచి అభ్యంతరాలు, నిర్మాణాలకు నిలుపుదల, ఏ విధమైన నోటీసులు అందకపోవడంతో ఆక్రమణ పెరుగుతూ వచ్చింది. దీంతో మరో రేకు షెడ్డును సైతం నిర్మించారు. ఇంత జరుగుతున్నా అధికారులు తమకు సంబంధం లేనట్టుగానే కన్నీటి చూడని పరిస్థితి నెలకొంది. ఒకపక్క ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి స్థలం లేక గ్రామ పెద్దలు స్థలాలను దానం చేస్తుంటే ఆక్రమణదారులు
అనుగా ఉన్న చోట ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. పేదవాడు తలదాచుకోవడానికి స్థలం లేక అద్దె ఇంట్లో ఉంటుంటే సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి (ఈ లక్షధికారి) లక్షలు విలువ చేసే ప్రభుత్వ భూమిపై దుకాణాలను నిర్మించి ఆపై వచ్చే సొమ్మును దండుకోవాలనే దురుద్దేశంతో అక్రమ వ్యాపార కట్టడాల నిర్మాణాన్ని పూర్తిచేసి త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే కొనసాగితే కవిటంలో ప్రభుత్వ భూమి కనుమరుగే. ఇప్పటికైనా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గ్రామ పెద్దలు, అధికారులు ఆక్రమణ, అక్రమ కట్టడాలపై జోక్యం చేసుకుని చర్యలు తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి, వీఆర్వో కుమార్ వివరణ కోరగా ఇప్పటికే ఆక్రమణదారికి ఒక నోటీస్ అందించామని త్వరలో తగిన చర్యలు చేపడతామని తెలిపారు.
