జాతీయ రహదారిపై విద్యార్థినుల ధర్నా
అవినీతి ఆపండి... ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు
షాద్ నగర్ (రంగారెడ్డి జిల్లా): నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల డిగ్రీ కళాశాలలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ వందలాది మంది విద్యార్థినులు ఆదివారం ఉదయం షాద్ నగర్ పట్టణంలో ఆందోళనకు దిగారు.

ఉదయం సుమారు 9.45 గంటల సమయంలో కమ్మదనం శివారులోని నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో నడుస్తున్న గురుకులం నుండి విద్యార్థినులు పాదయాత్రగా బయలుదేరి షాద్ నగర్ బైపాస్ రహదారిపై చేరుకున్నారు. "ముందు అక్రమాలు ఆపండి, తర్వాత విద్య అందించండి", "లంచగొండితనాన్ని రూపుమాపండి", "ప్రిన్సిపల్ డౌన్ డౌన్" అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై కూర్చున్నారు.

విద్యార్థినులను ఆందోళన నుంచి ఆపడానికి అధ్యాపకులు, సిబ్బంది విఫలయత్నం చేశారు. అయినప్పటికీ విద్యార్థినులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ హఠాత్ ధర్నా వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థినులను సమాధానపరిచే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే విద్యార్థినులు తమ ఆందోళనను విరమించక, గురుకులంలో జరుగుతున్న అవినీతి పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో షాద్ నగర్ జాతీయ రహదారిపై కొన్ని గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది.
Publisher
Namasthe Bharat
