విద్యాభివృద్ధికి పునాది వేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలామ్
నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 11_) భారత రత్న, భారతదేశ తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సేవలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ జీవితంలో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు.
మంగళవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ 137వ జయంతి, మైనార్టీల సంక్షేమ దినోత్సవం మరియు జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన తో కలిసి హాజరై మౌలానా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాభివృద్ధికి పునాది వేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సేవలు అపారమని అన్నారు. ఆయన భారత తొలి విద్యాశాఖ మంత్రిగా దేశ విద్యా విధానానికి పునాది వేయడంతో పాటు పేద, వెనుకబడిన వర్గాల పిల్లల విద్యకు మార్గం చూపారని వివరించారు.
మౌలానా ఆజాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత, విద్యావేత్తగా దేశానికి ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. ఆయన చూపిన మార్గం నేటికీ విద్యావేత్తలకు, విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
దేశం మరియు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు విద్యావంతులు కావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. అర్హులందరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకుని తమ జీవితాన్ని అభివృద్ధి దిశగా నడిపించుకోవాలని సూచించారు.
ప్రస్తుతం భారతీయులు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్టమైన సేవలు అందిస్తున్నారంటే, దానికి పునాది మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ చూపిన విద్యా దార్శనికతేనని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.
మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధికారి సంజీవరావు, బీసీ వెల్ఫేర్ అధికారిని విజయలక్ష్మి, ఐడిఓసి అధికారులు, సిబ్బంది మరియు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
